Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీ డ్రాప్ చేసిన క్యాచ్‌ని డైవ్ చేస్తూ అందుకున్న రిషబ్ పంత్... అప్పీలు చేయక వికెట్ కోల్పోయిన ఉమేశ్...

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు: 124 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్..  అప్పీలు చేయకపోవడంతో మరో వికెట్‌ని చేజార్చుకున్న టీమిండియా... 

India vs Bangladesh 1st Test: Virat Kohli drops, Rishabh Pant takes superb catch with drive
Author
First Published Dec 17, 2022, 12:49 PM IST

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పోరాడుతోంది. 513 పరుగుల భారీ లక్ష్యంతో నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లాదేశ్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసింది బంగ్లాదేశ్. తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత నజ్ముల్ హుస్సేన్ షాంటో వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్...

ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో షాంటో ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌ని ఉన్న విరాట్ కోహ్లీ అందుకోలేకపోయాడు. కోహ్లీ చేతుల్లో పడి ఎగిరి కిందపడుతున్న బంతిని గమనించిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచ్‌గా మలిచాడు. 124 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్...

12 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన యాషిర్ ఆలీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 131 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది బంగ్లా. తొలి వికెట్ తీసిన ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 53వ ఓవర్‌లో ఐదో బంతి... బంగ్లా వికెట్ కీపర్ లిటన్ దాస్ బ్యాటు అంచుని తాకుతూ వెళ్లి, రిషబ్ పంత్ చేతుల్లో పడింది. అయితే ఎడ్జ్‌ని గమనించని వికెట్ కీపర్ రిషబ్ పంత్ కానీ, బౌలర్ ఉమేశ్ యాదవ్ కానీ అప్పీలు చేయలేదు. దీంతో లిటన్ దాస్ డకౌట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు...

వెంటవెంటనే మరో వికెట్ తీసే అవకాశాన్ని టీమిండియా కోల్పోయినట్టైంది. 57 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది బంగ్లాదేశ్. టీమిండియా విధించిన లక్ష్యానికి ఇంకా 372 పరుగుల దూరంలో ఉంది బంగ్లాదేశ్. 

 

2022 ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాపై వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయిన కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పిన కెఎల్ రాహుల్, బంగ్లా టూర్‌లోనూ చెత్త రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌‌కి 100+ భాగస్వామ్యం అందించిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా చెత్త రికార్డు నెలకొల్పాడు కెఎల్ రాహుల్...

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల ఆధిక్యం అందుకున్న తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 61.4 ఓవర్లు బ్యాటింగ్ చేసి 258/2 పరుగులకి డిక్లేర్ చేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల కొండంత లక్ష్యాన్ని పెట్టింది...  జిడ్డు బ్యాటింగ్‌తో బౌలర్లను విసిగించే ఛతేశ్వర్ పూజారా... 130 బంతుల్లో 13 ఫోర్లతో 102 పరుగులు చేశాడు.

ఛతేశ్వర్ పూజారా కెరీర్‌లో ఇదే ఫాస్ట్ సెంచరీ. 52 ఇన్నింగ్స్‌లు, 1400+ రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ అందుకున్నాడు ఛతేశ్వర్ పూజారా. పూజారా సెంచరీ తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

రెండో ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 70 పరుగులు జోడించారు. 62 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మొదటి 54 బంతుల్లో 17 పరుగులే చేసిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత గేరు మార్చి బ్యాటింగ్ చేశాడు. 147 బంతుల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్. 

సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే శుబ్‌మన్ గిల్ అవుట్ అయ్యాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మెహిదీ హసన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి మోమినుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.  పూజారా- శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios