ముగిసిన నాలుగో రోజు ఆట... విజయానికి 4 వికెట్ల దూరంలో టీమిండియా...
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. విజయానికి 4 వికెట్ల దూరంలో టీమిండియా..

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 42/0 వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 102 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. టీమిండియా విధించిన లక్ష్యానికి ఇంకా 241 పరుగుల దూరంలో ఉంది భారత జట్టు. నాలుగో రోజు తొలి సెషన్‌లో బంగ్లాకి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 124 పరుగుల భాగస్వామ్యం జోడించి, తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా పరుగులు రాబట్టారు...
156 బంతుల్లో 7 ఫోర్లతో 67 పరుగులు చేసిన నజ్ముల్ హుస్సేన్ షాంటో, ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ చేతుల్లో పడి చేజారిన బంతిని డైవ్ చేస్తూ ఒడిసి పట్టుకున్న రిషబ్ పంత్, టీమిండియాకి మొదటి వికెట్ అందించాడు...
ఆ తర్వాత యాసిర్ ఆలీ 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత లిటన్ దాస్, జాకీర్ హసన్ కలిసి మూడో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 59 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసిన లిటన్ దాస్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన ఆరంగ్రేటం ఆటగాడు జాకీర్ హసన్ 224 బంతుల్లో 12 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ చేశాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన మొట్టమొదటి బంగ్లా ఓపెనర్‌గా నిలిచిన జాకీర్ హసన్, సరిగ్గా 100 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
50 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన ముస్తాఫికర్ రహీం, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నురుల్ హసన్ 3 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనే స్టంపౌట్ అయ్యాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ కలిసి ఏడో వికెట్‌కి 84 బంతుల్లో 34 పరుగులు జోడించారు...
బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ 69 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేయగా మెహిదీ హసన్ మిరాజ్ 40 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఆట చివరి రోజు ఎంతసేపు బ్యాటింగ్ చేస్తారనేదానిపైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది.