India vs Australia 2nd test: 46/0 నుంచి 66/4 స్థితికి చేరుకున్న టీమిండియా... ఛతేశ్వర్ పూజారా డకౌట్.. మరోసారి నిరాశపరిచిన కెఎల్ రాహుల్..
ఢిల్లీ టెస్టులో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవర్‌నైట్ స్కోరు 21/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి నాథన్ లియాన్ ఊహించని షాక్ ఇచ్చాడు. 41 బంతుల్లో ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన నాథన్ లియాన్, ఆ తర్వాత రోహిత్ శర్మను అవుట్ చేసి, ఛతేశ్వర్ పూజారాని డకౌట్ చేశాడు.
69 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేసిన రోహిత్ శర్మ, నాథన్ లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో ఛతేశ్వర్ పూజారా అవుట్ కావడం ఇది ఏడోసారి. టెస్టుల్లో రోహిత్‌ని అత్యధిక సార్లు అవుట్ చేసిన స్పిన్నర్‌గా నాథన్ లియాన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. రోహిత్ అవుటైన తర్వాత రెండో బంతికి పూజారా వికెట్ కోల్పోయింది భారత జట్టు. 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా, 7 బంతులు ఆడి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
15 బంతుల్లో 4 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, నాథన్ లియాన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకానొక దశలో 46/0 స్కోరుతో ఉన్న భారత జట్టు, 20 పరుగుల తేడాలో 4 కీలక వికెట్లు కోల్పోయి 66/4 స్థితికి చేరుకుంది..
క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా చేసే స్కోరుపైనే టీమిండియా ఆశలు పెట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ టెస్టులో భారత జట్టు పైచేయి సాధించాలంటే కనీసం తొలి ఇన్నింగ్స్‌లో 300+ పరుగుల స్కోరు చేయాల్సి ఉంటుంది. రవీంద్ర జడేజా ఒక్క పరుగు వద్ద ఇచ్చిన క్యాచ్‌ని స్లిప్‌లో స్టీవ్ స్మిత్ జారవిడిచాడు. లేకపోతే టీమిండియా మరో వికెట్ కోల్పోయి ఉండేది...
100వ టెస్టులో డకౌట్ అయిన రెండో భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఛేతశ్వర్ పూజారా. ఇంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ 1988లో తన వందో టెస్టులో న్యూజిలాండ్‌తో టెస్టులో డకౌట్ అయ్యాడు. దిలీప్ వెంగ్‌సర్కార్ తొలి ఇన్నింగ్స్‌లో 25 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా పూజారా మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.. నాథన్ లియాన్ బౌలింగ్‌లో పూజారా అవుట్ కావడం ఇది 11వ సారి. టెస్టుల్లో నాథన్ లియాన్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు అవుటైన బ్యాటర్‌గా నిలిచాడు పూజారా..
2022 ఆరంభంలో జరిగిన సౌతాఫ్రికా టెస్టు సిరీస్ నుంచి గత 14 నెలల కాలంలో కెఎల్ రాహుల్ టెస్టుల్లో ఒకే ఒక్కసారి 50 పరుగులు నమోదు చేశాడు. మిగిలిన మ్యాచుల్లో కనీసం 25+ పరుగుల స్కోరు కూడా నమోదు చేయలేకపోయాడు కెఎల్ రాహుల్. జోహన్‌బర్గ్ టెస్టులో తాత్కాలిక కెప్టెన్‌గా 50 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆ తర్వాత 8, 12, 10, 22, 23, 10, 2, 20, 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
