అనారోగ్యం నుంచి కోలుకోని ప్యాట్ కమ్మిన్స్ తల్లి... సిడ్నీలో తల్లి చెంతనే ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్!  నాలుగో టెస్టుకి కూడా కెప్టెన్‌గా వ్యవహరించనున్న స్టీవ్ స్మిత్.. 

మొదటి రెండు టెస్టుల్లో ఓడిన తర్వాత మూడో టెస్టులో ఘన విజయం అందుకుంది ఆస్ట్రేలియా. రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనం కావడంతో తాత్కాలిక సారథిగా బాధ్యతలు తీసుకున్న స్టీవ్ స్మిత్...ఆస్ట్రేలియాకి 2023 టూర్‌లో తొలి విజయం అందించాడు.

రెండో టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిన ప్యాట్ కమ్మిన్స్, మూడో టెస్టు సమయానికి తిరిగి ఇండియాకి వస్తాడని అనుకున్నారు. అయితే ఆయన తల్లి ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అక్కడే ఉండి చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు ప్యాట్ కమ్మిన్స్. నాలుగో టెస్టు మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది.. ఇప్పటికీ కమ్మిన్స్ తల్లి అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో నాలుగో టెస్టులో కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌కి కూడా ప్యాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉండడం కష్టమే. కమ్మిన్స్ రాకపోతే వన్డే సిరీస్‌కి అలెక్స్ క్యారీ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, భారత పర్యటనలో రెండు టెస్టు విజయాలు అందుకుంది..

ఆడమ్ గిల్‌క్రిస్ట్ తర్వాత ఇండియాలో ఇండియపై రెండు టెస్టు విజయాలు అందుకున్న ఆస్ట్రేలియా సారథిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు స్టీవ్ స్మిత్. గత 10 ఏళ్లలో భారత జట్టు స్వదేశంలో 3 టెస్టులు ఓడిపోతే అందులో రెండు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియాతో ఆడిన టెస్టులే..

ఇండోర్ టెస్టులో ఆట ఆరున్నర సెషన్ల పాటు సాగితే అందులో ఐదున్నర సెషన్ల పాటు ఆస్ట్రేలియా ఆధిపత్యమే సాగింది... ఫీల్డ్‌లో చురుగ్గా కదిలిన స్టీవ్ స్మిత్, బ్యాటర్లకు తగ్గట్టుగా బౌలర్లను మారుస్తూ ఎంతో తెలివిగా కెప్టెన్సీ చేశాడు... అంతేకాకుండా ఫీల్డింగ్‌లో మెరుపు క్యాచులు అందుకున్నాడు.

భారత టాపార్డర్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ముగ్గురు స్పిన్నర్లను మార్చి మార్చి వాడుతూ ఇబ్బంది పెట్టిన స్టీవ్ స్మిత్... అశ్విన్, అక్షర్ పటేల్ వంటి భారత స్పిన్నర్లు బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో మిచెల్ స్టార్క్‌ రూపంలో ఫాస్ట్ బౌలర్‌ని తీసుకొచ్చి ఫలితం రాబట్టాడు.. నాలుగో టెస్టుకి కూడా స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగింది.

మూడో టెస్టులో ఆస్ట్రేలియాకి విజయాన్ని అందించి, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ బెర్త్‌ని కన్ఫార్ట్ చేశాడు స్టీవ్ స్మిత్. మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ని 2-2 తేడాతో సమం చేయగలుగుతుంది ఆస్ట్రేలియా. అదే జరిగితే భారత జట్టు ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతాయి..

2017 టీమిండియా పర్యటనలో పూణె టెస్టులో 300+ పరుగుల భారీ తేడాతో భారత జట్టుపై టెస్టు మ్యాచ్ గెలిచిన స్టీవ్ స్మిత్, ఇండోర్ టెస్టులో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నాడు. 2010 నుంచి గత 13 ఏళ్లలో టీమిండియా స్వదేశంలో 3 టెస్టులు మాత్రమే ఓడింది. 

మొదటి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత జట్టు, నాలుగో టెస్టుని గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి వెళ్తుంది. లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగే టెస్టు సిరీస్ ఫలితాన్ని బట్టి టీమిండియా ఫైనల్ చేరుతుందా? లేదా? అనేది తేలుతుంది..