మూడున్నరేళ్ల తర్వాత టెస్టు సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ... 44 పరుగులు చేసి అవుటైన శ్రీకర్ భరత్... 400 దాటిన టీమిండియా స్కోరు...
మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామానికి బ్రేక్ ఇచ్చి, టెస్టుల్లో సెంచరీ బాదేశాడు విరాట్ కోహ్లీ. 424 రోజులుగా టెస్టుల్లో 50+ స్కోరు కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ... ఎట్టకేలకు అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ అందుకున్నాడు. 241 బంతుల్లో 5 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ, టెస్టు కెరీర్‌లో 28వ సెంచరీ, 75వ అంతర్జాతీయ సెంచరీ అందుకున్నాడు..
ఓవర్‌నైట్ స్కోరు 289/3 వద్ద నాలుగో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, రవీంద్ర జడేజా వికెట్ త్వరగా కోల్పోయింది. 84 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఉస్మాన్ ఖవాజాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
అయితే శ్రీకర్ భరత్‌తో కలిసి ఐదో వికెట్‌కి 182 బంతుల్లో 84 పరుగుల భాగస్వామ్యం జోడించాడు విరాట్ కోహ్లీ. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన శ్రీకర్ భరత్, కామెరూన్ గ్రీన్ వేసిన ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 21 పరుగులు రాబట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఒక ఓవర్‌లో ఇదే అత్యధికం.
మొదటి ఐదు వికెట్లకు కూడా 50+ భాగస్వామ్యాలు నమోదు చేయడం ఇండియాకి ఇది మూడొసారి. ఇంతకుముందు 1993లో ముంబైలో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్‌పై ఈ ఫీట్ సాధించింది భారత జట్టు. 2007లో మీర్‌పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై ఈ ఫీట్ సాధించిన టీమిండియా, ఆస్ట్రేలియాపై మొదటిసారి ఈ రికార్డు కొట్టింది...
విరాట్ కోహ్లీ 98 పరుగుల వద్ద ఉన్నప్పుడు శ్రీకర్ భరత్ అవుట్ అయ్యాడు. 88 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేసి... నాథన్ లియాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
ఇండియాలో అత్యధిక వికెట్లు తీసిన విదేశీ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు నాథన్ లియాన్. ఇండియాలో 55 వికెట్లు తీసిన నాథన్ లియాన్, 54 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ మాజీ బౌలర్ డెరిక్ అండర్‌వుడ్ రికార్డును అధిగమించేశాడు. నాథన్ లియాన్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్ అవుట్ కావడం 5 ఇన్నింగ్స్‌ల్లో ఇది నాలుగోసారి...
ఏ మాత్రం తొందరపడకుండా ఇన్నింగ్స్‌లో ఒక్కో పరుగు జోడిస్తూ సెంచరీ అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఓవర్‌నైట్ స్కోరు 59 పరుగుల వద్ద బ్యాటింగ్ మొదలెట్టిన విరాట్ కోహ్లీ, 41 పరుగులు జోడించినా నాలుగో రోజు బ్యాటింగ్‌లో ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయాడు.
విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇదో రెండో స్లోయెస్ట్ సెంచరీ. ఇంతకుముందు 2012లో నాగ్‌పూర్ టెస్టులో 289 బంతుల్లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఈసారి 241 బంతులు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీకి ఇది 16వ సెంచరీ. 20 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉండగా, కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు...
