424 రోజుల తర్వాత టెస్టుల్లో 50+ స్కోరు నమోదు చేసిన విరాట్ కోహ్లీ... అహ్మదాబాద్ టెస్టుకి తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో మొదటి మూడు టెస్టులు వన్ సైడెడ్‌గా జరిగాయి. తొలి రెండు టెస్టుల్లో టీమిండియా ఘన విజయాలు అందుకుంటే, మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుని కమ్‌బ్యాక్ ఇచ్చింది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది...
ఉస్మాన్ ఖవాజా 180, కామెరూన్ గ్రీన్ సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఐదున్నర సెషన్ల పాటు బ్యాటింగ్ చేయగా భారత జట్టు కూడా ధీటుగా బదులిచ్చే దిశగా సాగుతోంది...
మూడో రోజు ఆట ముగిసే సమయానికి 99 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది భారత జట్టు. నాలుగో రోజు ఆటలో జరిగే మార్పులు, ఐదో రోజు ఆటను, ఫలితాన్ని డిసైడ్ చేయబోతున్నాయి...
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెన్నునొప్పితో బాధపడ్డాడు. డ్రింక్ బ్రేక్ సమయంలో విరాట్ కోహ్లీ గ్రౌండ్ మీద మోకాళ్లపై కూర్చొని, కాసేపు సేద తీరాడు. ఈ సమయంలో అతని దగ్గరికి వచ్చిన ఆస్ట్రేలియా తాత్కాలిక సారథి స్టీవ్ స్మిత్... విరాట్ కోహ్లీ బ్యాటును పరీక్షించాడు... డ్రింక్స్ తీసుకొచ్చిన కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చేతులు కట్టుకుని, స్టీవ్ స్మిత్ చేష్టలను చూస్తూ ఉండిపోయారు..
విరాట్ కోహ్లీ వాడే ‘ఎంఆర్‌ఎఫ్’ బ్యాటును పరీక్షించి, అక్కడ పెట్టేసి... అతనితో ఏదో మాట్లాడి మళ్లీ ఫీల్డ్ సెట్టింగ్స్‌లో బిజీ అయిపోయాడు స్టీవ్ స్మిత్. 2021 జనవరి సమయానికి విరాట్ కోహ్లీ 27 టెస్టు సెంచరీలతో టాప్‌లో ఉంటే స్టీవ్ స్మిత్ 26 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. 17 సెంచరీలతో జో రూట్ నాలుగో స్థానంలో ఉండగా కేన్ విలియంసన్ 24 సెంచరీలతో ఉన్నాడు...
అయితే 2023 మార్చి సమయానికి స్టీవ్ స్మిత్ 30 టెస్టు సెంచరీలతో టాప్‌లోకి దూసుకెళ్లగా జో రూట్ 29 టెస్టు సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. గత రెండేళ్లలో జో రూట్ 12 టెస్టు సెంచరీలు కొడితే విరాట్ కోహ్లీ మాత్రం ఒక్క సెంచరీ కూడా చేయలేక అక్కడే ఉండిపోయాడు.. ప్రస్తుతం ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 2లో ఉన్న స్టీవ్ స్మిత్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క 50+ స్కోరు కూడా చేయలేకపోయాడు.
స్వదేశంలో 50వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, స్వదేశంలో 4 వేల టెస్టు పరుగులను పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా 424 రోజుల తర్వాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ స్కోరును అందుకున్నాడు విరాట్ కోహ్లీ..
128 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతో 59 పరుగులతో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 12వ సారి 100కి పైగా బంతులను ఎదుర్కొన్నాడు... ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీకి ఇది 39వ 50+ స్కోరు. సచిన్ టెండూల్కర్ 51 సార్లు, వీవ్ రిచర్డ్స్ 42 సార్లు ఆస్ట్రేలియాపై 50+ స్కోర్లు సాధించి విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు..
ఈ హాఫ్ సెంచరీతో స్వదేశంలో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 58.98కి చేరింది. వీరేంద్ర సెహ్వాగ్ 54.13, సచిన్ టెండూల్కర్ 52.67, రాహుల్ ద్రావిడ్ 51.35తో విరాట్ కోహ్లీ తర్వాతి ప్లేసుల్లో ఉన్నారు..
