ఆఖరి రోజు లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... ఇంకా టీమిండియా ఆధిక్యానికి 18 పరుగుల దూరంలో ఆసీస్.. 

అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఇండియా- ఆస్ట్రేలియా నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఓవర్ నైట్ స్కోరు 3/0 వద్ద ఆఖరి రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా, తొలి సెషన్‌లో 30 ఓవర్లు బ్యాటింగ్ చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయింది...

నైట్ వాచ్‌మెన్‌గా ఓపెనర్‌గా వచ్చిన మాథ్యూ కుహ్నేమన్, 35 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. కుహ్నేమన్ వికెట్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా తరుపున 15 మంది ప్లేయర్లను అవుట్ చేసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్...

14 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియాని ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ కలిసి ఆదుకున్నారు. ట్రావిస్ హెడ్ 96 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేయగా, మార్నస్ లబుషేన్ 85 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కి అజేయంగా 152 బంతుల్లో 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖరి రోజు లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 571 పరుగులకి ఆలౌట్ కావడంతో 91 పరుగుల ఆధిక్యం దక్కింది. అందులో 73 పరుగులు కొట్టేసిన ఆస్ట్రేలియా, ఇంకా 18 పరుగుల దూరంలో మాత్రమే ఉంది. ఇంకా చేతిలో 9 వికెట్లు ఉండడం, రెండు సెషన్ల ఆట మాత్రమే మిగిలి ఉండడంతో ఆఖరి టెస్టు డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తోంది...

లంచ్ బ్రేక్ తర్వాత టీమిండియా బౌలర్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి, ఆస్ట్రేలియాని ఆలౌట్ చేస్తే... మ్యాచ్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, నాలుగు రోజు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. అందుకే అతని స్థానంలో 10వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చే యంగ్ స్నిన్నర్ మ్యాట్ కుహ్నేమన్‌ని ఓపెనర్‌గా పంపింది ఆస్ట్రేలియా.. ఒకవేళ ఉస్మాన్ ఖవాజా గాయం నుంచి కోలుకోకపోతే, రిటైర్డ్ హార్డ్‌గా అవుట్ అవుతాడు. ఆ లెక్కన టీమిండియా మరో 8 వికెట్లు తీస్తే సరిపోతుంది.