Asianet News TeluguAsianet News Telugu

మిగిలింది ఒక మ్యాచ్.. వెళ్లేవి రెండు జట్లు.. పోటీలో నాలుగు టీమ్‌లు.. రసవత్తరంగా గ్రూప్-2 సెమీస్ రేసు

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సూపర్-12 చివరి దశకు చేరుకున్నది. ఈ స్టేజ్ లో  అన్ని జట్లు నాలుగు మ్యాచ్ లు ఆడాయి. మిగిలింది ఒకటే మ్యాచ్. అయినా ఇప్పటివరకూ సెమీస్ చేరే జట్లలో  స్పష్టత లేదు. 

India South Africa on The Top but Pakistan and Bangladesh in The Fray check Out the Latest Semi-finals Scenario in Group 2
Author
First Published Nov 3, 2022, 6:54 PM IST

పొట్టి ప్రపంచకప్ లో అగ్ర జట్లు అంచనాలు తలకిందులు అవుతున్నాయి. వర్షం,  ఆటగాళ్ల ప్రదర్శన సరిగా లేకపోవడంతో  అగ్రశ్రేణి జట్లకు భారీ షాకులు తగులుతున్నాయి. ఇప్పటివరకు  ఈ టోర్నీలో భాగంగా సూపర్-12లో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్ లు (ఐదు మ్యాచ్ లు ఆడాలి) ఆడింది. ప్రతీ జట్టుకు మరొక మ్యాచ్ మాత్రమే మిగిలుంది.  గ్రూప్-1 (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, అఫ్గానిస్తాన్) తో పాటు గ్రూప్-2 (ఇండియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, జింబాబ్వే, పాకిస్తాన్, నెదర్లాండ్స్) లో కూడా సెమీస్ బెర్త్ లు  ఖాయం కాలేదు.  

సౌతాఫ్రికా - పాకిస్తాన్ మధ్య నేడు  సిడ్నీ వేదికగా ముగిసిన మ్యాచ్  ద్వారా సూపర్-12లో ప్రతీ జట్టు తమ ప్రత్యర్థులతో నాలుగు మ్యాచ్ లు ఆడింది. ఇక మిగిలింది ఒక్క మ్యాచ్ మాత్రమే. అయినా సెమీస్ పోరు రసవత్తరంగా ఉంది. 

పోటీలో కివీస్, ఇంగ్లాండ్, ఆసీస్.. 

గ్రూప్ - 1లో అఫ్గాన్  టోర్నీ నుంచి నిష్క్రమించగా ఐర్లాండ్ కూడా అదే బాట పట్టింది.  శ్రీలంక కు మరో మ్యాచ్ మిగిలే ఉన్నా ఆ జట్టు గెలిచినా  సెమీస్ కు వెళ్లే అవకాశాలు తక్కువే. ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్ లలో రెండు గెలిచి ఒకటి ఓడి (ఒకదాంట్లో వర్షం కారణంగా ఫలితం రాలేదు) ఐదు పాయింట్లతో ఉంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ కూడా ఇవే దశలో ఉన్నాయి. ఈ మూడు జట్లకు ఐదు పాయింట్లే ఉన్నా.. నెట్ రన్ రేట్ విషయంలో ఆస్ట్రేలియా మైనస్ లో ఉంది.  ఆ జట్టు తర్వాత మ్యాచ్ అఫ్గానిస్తాన్ తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచినా ఆ జట్టు న్యూజిలాండ్, ఇంగ్లాండ్  లు ఆడే చివరి మ్యాచ్ లో ఫలితం కోసం వేచి చూడాలి.  న్యూజిలాండ్ తర్వాత శ్రీలంకతో ఆడనుండగా.. ఇంగ్లాండ్ శ్రీలంకతో తలపడుతుంది. 

 

గ్రూప్ - 2లోనూ అదే కథ.. 

భారత జట్టు ఉన్న గ్రూప్-2లో కూడా పరిస్థితి గ్రూప్-1 కంటే గొప్పగా ఏమీ లేదు. ఈ  టోర్నీలో మూడు మ్యాచ్ లు ఓడిన నెదర్లాండ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.  జింబాబ్వే కూడా అదే బాట పట్టింది. భారత్ నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు విజయాలతో అగ్రస్థానంలో ఉంది. భారత్ కు 6 పాయింట్లు ఉన్నాయి. సౌతాఫ్రికా.. నాలుగింటిలో రెండు గెలిచి ఒకటి ఓడి (ఒకటి రద్దైంది) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.   వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన పాకిస్తాన్.. తర్వాత నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాలను ఓడించి సెమీస్ రేసులో నిలిచింది.  బంగ్లాదేశ్ ఖాతాలో కూడా నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు విజయాలతో నాలుగు పాయింట్లతో పాక్ తో సమానంగా నిలిచింది. 

 

ఈ నేపథ్యంలో  గ్రూప్-2 సెమీస్ రేసు కూడా రసవత్తరంగా మారింది. నవంబర్ 6న సౌతాఫ్రికా - నెదర్లాండ్స్, పాకిస్తాన్ -బంగ్లాదేశ్ లతో పాటు ఇండియా - జింబాబ్వే మధ్య మ్యాచ్ లు జరుగుతాయి. సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో తప్పక గెలవాలి.  ఓడితే  ఆ జట్టు భవిష్యత్ తలకిందులవుతుంది.  పాకిస్తాన్-బంగ్లాదేశ్ లో గెలిచిన జట్టు  సెమీస్ రేసులో  (సౌతాఫ్రికా నెదర్లాండ్స్ తో ఓడితే) ఉంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.  సఫారీలు ముందే గెలిస్తే ఈ రెండు జట్లలో విజేత..  ఇండియా-జింబాబ్వే మ్యాచ్ ఫలితం మీద ఆధారపడి ఉండాల్సి ఉంటుంది.  

ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఇండియా.. జింబాబ్వేను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు.  నెదర్లాండ్స్.. సఫారీలకు షాకివ్వకుంటే ఎటువంటి గొడవా లేకుండా గ్రూప్-2 నుంచి ఈ రెండు జట్లు సెమీస్  కు చేరుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios