Cheteshwar Pujara and Mohammed Rizwan: టీమిండియా టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా, పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ లు కలిసి ఒకే జట్టుకు ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు.
భారత టెస్టు జట్టులో కీలక ఆటగాడు ఛతేశ్వర్ పుజారా, పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ లు కలిసి ఒకే జట్టు తరఫున ఆడుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ కోసం సస్సెక్స్ జట్టు తరఫున అరంగేట్రం చేశారు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్-2022 కోసం ఈ ఇద్దరూ సస్సెక్స్ తో జతకలిశారు. పుజారా గతంలో ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ (యార్క్ షైర్ తరఫున) ఆడాడు. కానీ రిజ్వాన్ కు కౌంటీలు ఆడటం ఇదే తొలిసారి.
టామ్ డైన్స్ సారథ్యంలోని సస్సెక్స్ డెర్బిషైర్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరికీ ఆట రెండో రోజు (శుక్రవారం) బ్యాటింగ్ చేసే అవకాశం రావొచ్చునని సమాచారం.
కాగా ఈ ఇద్దరు ఒకే జట్టు తరఫున ఆడుతుండటం చూసిన ఇరు జట్ల అభిమానులు.. ఇండియా-పాకిస్తాన్ లు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాలని కోరుకుంటున్నారు. భారత్-పాక్ కు చెందిన ఆటగాళ్లు కలిసి ఇంగ్లీష్ కౌంటీలలో ఆడటం శుభపరిణామని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
టీమిండియా టెస్టు స్పెషలిస్టు అయిన పుజారా. గత కొద్దికాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నాడు. వరుస టోర్నీలలో విఫలమవుతూ ఒకరకంగా జట్టుకు భారంగా కూడా మారాడు. దీంతో ఇటీవలే లంకతో ముగిసిన టెస్టు సిరీస్ లో అతడితో పాటు మరో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానే కు తుది జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఈ ఇద్దరూ ఇటీవలే భారత్ లో ముగిసిన రంజీ సీజన్ లో కూడా ఆడారు. అయితే అక్కడ కూడా పెద్దగా మెరవలేదు.
కాగా ఈసారి ఐపీఎల్ లో ఏ జట్టూ పుజారాను కొనుగోలు చేయలేదు. గతంలో సీఎస్కే తరఫున ఉన్నా నామమాత్రపు ఆటగాడిగానే మిగిలాడు. దీంతో ఈసారి దొరికిన విరామాన్ని పుజారా.. తన బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం కోసం వాడుకుంటున్నాడు.
ఇప్పటివరకు భారత జట్టు తరఫున 95 టెస్టులాడిన పుజారా.. 6,713 పరుగులు చేశాడు. బ్యాటింగ్ యావరేజీ 43.88 గా ఉంది. పుజారా తన కెరీర్ ల 32 హాఫ్ సెంచరీలు, 18 సెంచరీలు చేశాడు. తన పేరిట 3 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక రిజ్వాన్ విషయానికొస్తే.. పాక్ తరఫున 22 టెస్టులలో ప్రాతినిథ్యం వహించిన ఈ యువ ఆటగాడు.. 1112 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో బాబర్ ఆజమ్ తో కలిసి అద్భుతాలు చేస్తున్న రిజ్వాన్.. 100 మ్యాచులలో 2,559 రన్స్ చేశాడు. ఇందులో 17 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు కూడా ఉన్నాయి.
