Asianet News TeluguAsianet News Telugu

Under-19 World Cup : అండర్-19 ఫైనల్స్ లో టీమిండియా ట్రాక్ రికార్డు ఇదే.. . 

Under-19 World Cup Finals : అండర్‌-19 చివరికి అంకానికి చేరుకుంది. ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 టైటిల్ పోరులో నేడు భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. కాగా..  టీమిండియాకు అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరుకోవ‌డం ఇది తొమ్మిదో సారి. వ‌రుస‌గా ఐదోసారి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది సార్లు ఫైన‌ల్ మ్యాచులు ఆడ‌గా ఐదు మ్యాచుల్లో గెలిచింది. మ‌రో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఇప్పుడూ ఉద‌య్ స‌హార‌న్ నేతృత్వంలో బ‌రిలో దిగుతున్న టీమిండియా టైటిల్ గెలిచేనా లేదా అనేది వేచిచూడాలి

India Record In Under-19 World Cup Finals 8 Appearances, 5 Wins, 3 Defeats KRJ
Author
First Published Feb 11, 2024, 5:32 AM IST

Under-19 World Cup Finals: ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య అండర్ 19 ప్రపంచకప్ టైటిల్ పోరు జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఇరు జట్లు అద్భుత ప్రదర్శన చేశాయి. కెప్టెన్ ఉదయ్ సహారన్ సారథ్యంలో భారత అండర్-19 జట్టు తొలి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.

అదే సమయంలో పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్లు తలపడనున్నాయి. దీంతో ఇరు జట్ల మధ్య గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ కు అదిరిపోయే ట్రాక్ రికార్డు ఉంది.భారత్ ఇప్పటి వరకు ఎనిమిది ఫైనల్స్ ఆడగా అందులో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో భారత్ అండర్-19 జట్టు ఫైనల్ మ్యాచ్ ఆడడం ఇది తొమ్మిదోసారి. అదే సమయంలో ఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను మూడుసార్లు కైవసం చేసుకుంది. 


ఈ తరుణంలో అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ ట్రాక్‌ రికార్డు ఎలా ఉందో ఓ లూక్కేద్దాం..

2000: మొహమ్మద్ కైఫ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా మొదటిసారి ఫైనల్‌కు చేరుకుంది. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అండర్ 19 జట్టు శ్రీలంకపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ జట్టులో యువరాజ్ సింగ్ కూడా ఉన్నాడు.
 
2006: 2006లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. రవికాంత్ శుక్లా సారథ్యంలో పాకిస్థాన్‌తో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా 38 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ జట్టులో రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా వంటి ఆటగాళ్లు ఉన్నారు.
 
2008:  అండర్-19 జట్టు ఫైనల్‌లో భారత్ ప్రవేశించడం ఇది మూడోసారి. విరాట్ కోహ్లీ నాయ‌క‌త్వంలో  ప్రతీకారంతో ఉన్న టీమిండియా టోర్నీ ప్రారంభం నుండే అదరగొట్టింది. కౌలాలంపూర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జరిగిన టైటిల్ పోరులో టీమిండియా విజయం సాధించింది.  ఎల్‌ఎస్ పద్ధతిలో భారత్ 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 159 ప‌రుగులు చేసింది. అనంత‌రం ద‌క్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 103 ప‌రుగుల‌కే ప‌రిమితమైంది. సౌరభ్ తివారీ, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, సిద్దార్థ్ కౌల్ వంటి ఆట‌గాళ్లు ఈ జ‌ట్టులో ఉన్నారు  
 
2012 : ఆస్ట్రేలియాను ఓడించి మూడోసారి భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడింది. టౌన్స్‌విల్లే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 225 ప‌రుగులు చేసింది.  ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ తన 111 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో టీమిండియా  47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజేత జట్టులో హనుమ విహారి, సందీప్ శర్మ కూడా ఉన్నారు. 

2016: మిర్పూర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇషాన్ కిషన్ నేతృత్వంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 145 ప‌రుగుల‌కే ఆలౌటైంది. ల‌క్ష్యాన్ని విండీస్ 49.3 ఓవర్లలో ఛేదించింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ వంటి ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ భార‌త్ ఓడిపోయింది.

2018: ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో రెండోసారి తలపడ్డ టీమిండియా ఘన విజయం సాధించింది. పృథ్వీ షా సారథ్యంలో భారత్ 38.5 ఓవర్లలో 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగో సారి క‌ప్పును ముద్దాడింది.  ఈ జట్టులో శుభ్‌మన్ గిల్, శివమ్ మావి వంటి ఆటగాళ్లు ఉన్నారు.

2020: ప్రియ‌మ్ గార్గ్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగిన టీమిండియా ఈ టోర్నీలో బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 177 పరుగులకే ఆలౌటైంది. వర్షం కారణంగా బంగ్లాదేశ్ DLS పద్ధతిలో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ జట్టులో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ , రవి బిష్ణోయ్ ఉన్నారు.
 
2022: ఈ టోర్నీలో ఫైనల్ కు చేరుకున్న భారత్.. ఇంగ్లండ్‌ను ఓడించి ఐదవ సారి టైటిల్‌ను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 189 పరుగులకు ఆలౌటైంది, యశ్ ధుల్ నేతృత్వంలోని టీమిండియా 47.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, రాజ్ బావా వంటి ఆటగాళ్లు ఉన్నారు.

ఇక ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన భార‌త్ వ‌రుస‌గా వరుస విజయాలతో దూసుకపోతుంది. ఫైనల్ పోరులో ముచ్చ‌గా మూడోసారి ఆసీస్‌ను ఓడించి ఆరోసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా అభిమానులు ఆశపడుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios