కరాచీ: భారత ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదీ మరోసారి నోరు పారేసుకున్నాడు. సమయం సందర్భం లేకుండా కూడా మోడీపై విరుచుకుపడడం ఆఫ్రిదీకి అలవాటుగా మారింది. రెండు దేశాల ప్రజలు సరిహద్దులు దాటాలని భావిస్తుంటే మోడీ తిరోగమనం వైపు పయనిస్తున్నారని ఆయన అన్నారు. 

మోడీ అధికారంలో ఉన్నంత వరకు పాకిస్తాన్, భార్త మధ్య క్రికెట్ మ్యాచులు జరగవని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మోడీ అధికారంలో ఉన్నంత వరకు భారత్ నుంచి మనకు ఏ విధమైన స్పందన కూడా రాదని, మోడీ ఎలా ఆలోచిస్తారో భారతీయులు సహా మనందరికీ తెలుసునని ఆయన అన్నాడు. 

ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి మోడీ అధికారంలో ఉన్నంత వరకు పాకిస్తాన్, భారత్ మధ్య క్రికెట్ ఉండదని ఆయన అన్నాడు. మోడీ ఆలోచనలు తిరోగమనాన్ని సూచిస్తున్నాయని ఆయన అన్నాడు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్నవాళ్లు ఒకరి దేశంలో మరొకరు ప్రయాణించాలని భావిస్తున్నారని ఆయన అన్నారు. 

అసలు మోడీ ఎజెండా ఏమిటో, ఏం చేయాలని అనుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని ఆఫ్రిదీ అన్నాడు.