ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా మంచి గుర్తింపుపొందిన యువ క్రికెటర్లలో దీపక్ చాహర్ ఒకరు. ఇలా ఐసిఎల్ ద్వారా అతడి ప్రతిభను గుర్తించిన టీమిండియా సెలెక్టర్లు ఇటీవల జరిగిన వెస్టిండిస్ పర్యటనకు ఎంపికచేశారు. అలా అందివచ్చిన అవకాశాన్ని ఒడిపట్టుకున్న చాహర్ నమ్మకాన్ని వమ్ముచేయలేదు. కరీబియన్ జట్టును తన వైవిద్య పేస్ బౌలింగ్ అటాక్ తో బెంబేలెత్తించి సత్తా చాటాడు. మూడో టీ20 మ్యాచ్ లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు పడగొట్టాడు. ఈ  ఒక్క ప్రదర్శనే అతడికి సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సీరిస్ లో కూడా అవకాశం వచ్చేలా చేసింది. 

తాాజాగా ఈ యువ సంచలనంగా చాహర్  సౌతాఫ్రికాతో టీ20 సీరిస్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ సందర్భంగా కెప్టెన్ కోహ్లీ, మాజీ  కెప్టెన్ ధోనిలు తనకు ఎలా సహకరించారో చాహర్  వెల్లడించాడు. తన కెరీర్ కొనసాగినంతకాలం వారిద్దరు వెన్నుతట్టి ప్రోత్సాహించిన విషయాన్ని గుర్తుపెట్టుకుంటానని...వారి నమ్మకం ఎప్పటికీ  కొనసాగేలా చూసుకుంటానని చాహర్ అన్నాడు.  

''వెస్టిండిస్ తో జరిగిన  మూడో టీ20 లో కొత్తబంతిని అందుకుంటానని  అస్సలు ఊహించలేదు. అంతకుముందు  మ్యాచ్ లో యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తో కెప్టెన్ కోహ్లీ మొదటి ఓవర్ వేయించాడు. అప్పుడే యువ ఆటగాళ్లను కోహ్లీ ప్రోత్సహిస్తున్న తీరు నన్నెంతో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాతి మ్యాచ్ లో నాకు ఆ అవకాశం దక్కడంతో మాటలు రాలేవు. కోహ్లీ ఎందుకంత గొప్ప ఆటగాడయ్యాడో అప్పుడే నాకు అర్థమయ్యింది. సీనియర్లు, జూనియర్లు అన్న తేడాలేకుండా ప్రతిభావంతులను గుర్తించడంలో అతడు నిజమైన కెప్టెన్. 

అతడి నమ్మకాన్ని వమ్ముచేయకుండా బాగా ఆడాలనుకున్నా. అందువల్లే కసిగా ఆడి నాలుగు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచా.  ఈ ప్రదర్శనే నాకు స్వదేశంలో జరిగే సౌతాఫ్రికా సీరిస్ కు ఎంపికయ్యేలా చేసింది. ఇందులో రాణించేందుకు ముందస్తుగానే ప్రాక్టీస్ ముమ్మరం చేశాను. ఇలా అందివచ్చిన అవకాశాల ద్వారా నన్ను నేను నిరూపించుకుంటాను. దీని ద్వారా 2020 లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ భారత జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నా.'' అని దీపక్ చాహర్ వెల్లడించాడు.