Asianet News TeluguAsianet News Telugu

IND vs AUS T20I: మళ్లీ దంచిన వేడ్.. టీమిండియా ముందు భారీ టార్గెట్.. రాణించిన అక్షర్

IND vs AUS T20I Live: 8 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా బాదుడే మంత్రంగా ఆడింది. టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ తన స్పిన్ తో  మెరిశాడు.

India Needs 91 Runs To Level The Series against Australia
Author
First Published Sep 23, 2022, 10:13 PM IST

పలు అంతరాయాల మధ్య నాగ్‌పూర్‌లో ప్రారంభమైన ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు.. 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఆసీస్ సారథి  ఆరోన్ ఫించ్ (15 బంతుల్లో 31, 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. తొలి టీ20లో ఆసీస్ ను గెలిపించిన మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఈ మ్యాచ్ లో కూడా మెరుపులు మెరిపించి ఆ జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మరోసారి టాప్ క్లాస్ బౌలింగ్ తో ఆసీస్ ను వణికించాడు. నెలన్నర తర్వాత  జట్టులోకి వచ్చిన బుమ్రా.. ఫించ్ ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సమం చేయాలంటే భారత జట్టు.. 48 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది. 

8 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఆస్ట్రేలియా బాదుడే మంత్రంగా ఆడటానికి యత్నించింది.  హార్ధిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్లోనే  ఆసీస్ సారథి  ఆరోన్ ఫించ్ రెండు ఫోర్లు బాదాడు. అయితే రెండో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ లో తొలి మ్యాచ్ హీరో కామోరూన్ గ్రీన్ (4) ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద మిస్ చేసిన విరాట్ కోహ్లీ..  అదే ఓవర్లో మూడో బంతికి అతడిని రనౌట్ చేశాడు.  

అదే ఓవర్లో అక్షర్.. గ్లెన్ మ్యాక్స్వెల్ (0) ను కూడా క్లీన్ బౌల్డ్ చేసి ఆసీస్ కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు మూడో ఓవర్  చాహల్ వేసి  12 పరుగులిచ్చాడు. 3 ఓవర్లలో ఆసీస్ స్కోరు 31-2. 

బంతి స్పిన్ కు అనుకూలిస్తుండటంతో రోహిత్.. నాలుగో ఓవర్ కూడా అక్షర్ కే ఇచ్చాడు. కెప్టెన్ నమ్మకాన్ని  అక్షర్ వమ్ము చేయలేదు.  నాలుగో ఓవర్లో తొలి బంతికే అతడు  టిమ్ డేవిడ్ (2) ను బౌల్డ్ చేశాడు. అంతేగాక ఆ ఓవర్లో  నాలుగు పరుగులే ఇచ్చాడు.  నాలుగు ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోరు 35-3. 

ఐదో ఓవర్ బుమ్రా వేశాడు. ఆ ఓవర్లో ఫించ్ తొలి బంతిని బౌండరీకి తరలించాడు. కానీ చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు. ఆరో ఓవర్ వేసిన హర్షల్ పటేల్.. 13 పరుగులిచ్చాడు. ఆ ఓవర్లో వేడ్.. రెండు చూడచక్కకని బౌండరీలతో అలరించాడు.  ఏడో ఓవర్ వేసిన బుమ్రా.. 12 పరుగులిచ్చాడు. 

 

ఇక చివరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్  లో రెండో బంతిని సిక్సర్ గా బాదిన వేడ్.. నాలుగు, ఐదో బంతిని కూడా స్టాండ్స్ లోకి పంపాడు. చివరి బంతికి స్టీవ్ స్మిత్ (8) రనౌట్ అయ్యాడు.  

8 ఓవర్ల మ్యాచే అయినా టీమిండియా ఏకంగా ఐదుగురు బౌలర్లను ఉపయోగించింది. అక్షర్, బుమ్రా, హర్షల్ లు రెండేసి ఓవర్లు వేశారు. అక్షర్ రెండు వికెట్లు తీయగా బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. హార్ధిక్, చాహల్, హర్షల్ లకు వికెట్ దక్కలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios