Asianet News TeluguAsianet News Telugu

BANvsIND: పోరాడుతున్న టీమిండియా.. ఆ ఒక్కడి మీదే ఆశలన్నీ.. ఓడితే సిరీస్ గోవిందా..!

BANvsIND ODI: బంగ్లాదేశ్‌తో మొదటి వన్డే ఓడిన భారత జట్టు రెండో వన్డేలో కూడా తడబడుతోంది.  కీలక బ్యాటర్స్ అంతా   పెవలియన్ బాట పట్టారు. స్వదేశంలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రఫ్ఫాడిస్తున్నది. 
 

India Lost Early Wickets, All Eyes On Shreyas Iyer and Axar Patel
Author
First Published Dec 7, 2022, 6:04 PM IST

బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియాకు  భారీ షాక్ తప్పేట్టు లేదు.  ఇప్పటికే తొలి వన్డేలో ఓడి పరువు పోగొట్టుకున్న భారత్ ఇప్పుడు ఏకంగా సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.  272 పరుగుల లక్ష్య ఛేదనలో  టీమిండియా  టాపార్డర్ బ్యాటర్లంతా ఔటయ్యారు. ప్రస్తుతానికి శ్రేయాస్  అయ్యర్ ఒక్కడే   ప్రధాన బ్యాటర్.  ఆదుకుంటాడనుకున్న  టీమిండియా వైస్ కెప్టెన్  కెఎల్ రాహుల్ కూడా నిరాశపరిచాడు. దీంతో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 26 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా.. నాలుగు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (55 నాటౌట్), అక్షర్ పటేల్ (23 నాటౌట్)  క్రీజులో ఉన్నారు. 

బంగ్లాదేశ్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా  సారథి రోహిత్ శర్మకు గాయం కావడంతో అతడు   బ్యాటింగ్ కు రాలేదు. దీంతో  శిఖర్ ధావన్ కు జతగా విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వచ్చాడు.  కానీ  కోహ్లీ.. 6 బంతుల్లో 5 పరుగులే చేసి  ఎబాదత్ హోసేన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

న్యూజిలాండ్ సిరీస్ నుంచి తడబడుతున్న శిఖర్ ధావన్ కూడా 10 బంతుల్లో 8 పరుగులే చేసి  ముస్తాఫిజుర్ బౌలింగ్ లో  మెహిది హసన్ కు క్యాచ్ ఇచ్చాడు.  ఇక ఈ మ్యాచ్ లో  భారత్   ఐదోస్థానంలో రాహుల్ ను కాకుండా వాషింగ్టన్  సుందర్ ను  పంపించి ప్రయోగం చేసింది. కానీ ఈ ప్రయోగం  వికటించింది.   సుందర్.. 28 బంతుల్లో 14 పరుగులే  చేసి షకిబ్ అల్  హసన్  బౌలింగ్ లో  లిటన్ దాస్ కు క్యాచ్ ఇచ్చాడు. 

మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన  శ్రేయాస్.. బంగ్లా బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకుంటున్నాడు.   సుందర్ నిష్క్రమించాక.. కెఎల్ రాహుల్ తో కలిసి   నాలుగో వికెట్ కు  25 పరుగులు జోడించాడు.  కానీ  రాహుల్.. 28 బంతుల్లో 14 పరుగులు చేసి  మెహిది హసన్ బౌలింగ్ లో  ఎల్బీడబ్ల్యూగా  వెనుదిరిగాడు.  దీంతో భారత్ 65 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 

 

రాహుల్ నిష్క్రమించాక క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్..  అయ్యర్ కు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు  ఇప్పటికే  60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరి తర్వాత  స్పెషలిస్టు బ్యాటర్లు కూడా  ఎవరూ లేరు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లు బ్యాటింగ్ చేసినా అది  మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు అయితే కాదు. ప్రస్తుతం ఆడుతున్న  శ్రేయాస్, అక్షర్ ల మీదే భారత జట్టు ఆశలన్నీ ఉన్నాయి.  ఈ మ్యాచ్ లో ఓడితే మాత్రం టీమిండియా  సిరీస్ కోల్పోయే ప్రమాదమున్నది.  ఈ నేపథ్యంలో  శ్రేయాస్-అక్షర్ లు మరో పదిహేను ఓవర్లు ఆడగలిగితే  అప్పుడు  భారత్ కు విజయావకాశాలుంటాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios