Asianet News TeluguAsianet News Telugu

అదరగొట్టిన నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్... రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ ఫైనల్‌కి ఇండియా లెజెండ్స్...

మొదటి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న ఇండియా లెజెండ్స్.. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీస్...

India Legends qualified into the Final of the Road Safety World Series 2022
Author
First Published Sep 29, 2022, 5:48 PM IST

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్‌కి దూసుకెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా సీజన్ 2ని ఆరంభించిన సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. ఈ విజయంతో ఇండియా లెజెండ్స్, వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్‌కి అర్హత సాధించింది....


వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన సెమీ ఫైనల్ 1లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా లెజెండ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. షేన్ వాట్సన్ 21 బంతుల్లో 6 ఫోర్లతో 30 పరుగులు చేయగా అలెక్స్ దూలన్ 31 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. 

బెన్ డంక్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేయగా కల్లమ్ ఫర్గూసన్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 46 పరుగులు చేశాడు. రేర్డన్ 5 పరుగులు చేయగా కామెరూన్ వైట్ 18 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు, హేడిన్ 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

భారత బౌలర్లలో యూసఫ్ పఠాన్, అభిమన్యు మిథున్ రెండేసి వికెట్లు తీయగా రాహుల్ శర్మ ఓ వికెట్ తీశాడు. 172 పరుగుల లక్ష్యఛేదనలో సచిన్ టెండూల్కర్ వికెట్ త్వరగా కోల్పోయింది ఇండియా లెజెండ్స్. 11 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్, రేర్డన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సురేష్ రైనా 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేయగా యువరాజ్ సింగ్ 15 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...

స్టువర్ట్ బిన్నీ 2, యూసఫ్ పఠాన్ 1  పరుగు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఇండియా లెజెండ్స్. అయితే ఓపెనర్‌గా వచ్చిన వికెట్ కీపర్ నమన్ ఓజా 62 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 పరుగులు... ఇర్ఫాన్ పఠాన్ 12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి టీమిండియాకి విజయాన్ని అందించారు... 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది ఇండియా లెజెండ్స్....

బుధవారం ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లు ముగిసిన తర్వాత కుండపోతగా వర్షం కురవడంతో మ్యాచ్‌ని గురువారం సెప్టెంబర్ 29కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. రెండో రోజు సెమీ ఫైనల్స్‌ని కొనసాగించిన మిగిలిన 3 ఓవర్లలో ఓవర్‌నైట్ స్కోరుకి 35 పరుగులు జోడించింది.

రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నేడు శ్రీలంక లెజెండ్స్ టీమ్, వెస్టిండీస్ లెజెండ్స్ జట్టుతో తలబడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అక్టోబర్ 1న శనివారం జరిగే ఫైనల్‌లో ఇండియా లెజెండ్స్‌తో టైటిల్ పోరులో నిలుస్తుంది.. 

Follow Us:
Download App:
  • android
  • ios