కరాచీ: ఇండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ ఇషాన్ మని విషం కక్కారు. శ్రీలంక, పాకిస్తాన్ మధ్య సోమవారం రెండో టెస్టు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ లో క్రికెట్ ఆడడం ప్రమాదకరం కాదని తాము నిరూపించినట్లు ఆయన తెలిపారు. 

ఒకవేళ ఎవరైనా క్రికెట్ ఆడడానికి రాకపోతే ఇక్కడ భద్రతాపరమైన ప్రమాదం పొంచి ఉందని రుజువు చేయాలని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో పాకిస్తాన్ కన్నా భారతే చాలా ప్రమాదకరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు శ్రీలంక జట్టు ఇక్కడ పర్యటించిన తర్వాత భద్రతపై ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదని అన్నారు. 

దశాబ్దం తర్వాత పాకిస్తాన్ లో టెస్టు క్రికెట్ తిరిగి ప్రారంభం కావడం కీలకమైన ఘట్టమని ఆయన అన్నారు. అదే విధంగా సానుకూల వాతావరణం చోటు చేసుకుందని ప్రపంచానికి చాటడానికి పాక్ మీడియా, అభిమానులు ఎంతో సహకరించినట్లు ఆయన తెలిపారు. 

జనవరిలో బంగ్లాదేశ్ ఇక్కడ పర్యటించడానికి అవసరమైన సంప్రదింపులు జరుగుతున్నాయని, అలాగే ఇతర జట్లతో కూడా చర్చలు జరుపుతామని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్ తప్పకుండా పాక్ పర్యటనకు వస్తుందనే విశ్వాసం ఉందని చెప్పారు. వాళ్లు తిరస్కరించడానికి ప్రస్తుతం ఏ విధమైన కారణాలు కూడా లేవని ఆయన అన్నారు. ఒక్కసారి శ్రీలంక జట్టు పర్యటించిన తర్వాత ఇతర జట్లు ఎందుకు రావని ఆయన అడిగారు. 

పదేళ్ల తర్వాత పాకిస్తాన్ లో టెస్టు క్రికెట్ జరిగింది. 2009లో పాకిస్తాన్ లో పర్యటించిన శ్రీలంక జట్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు దాంతో అప్పటి నుంచి పాకిస్తాన్ లో క్రికెట్ ఆడడానికి ఇతర దేశాల జట్లు ఏవీ రావడం లేదు. 

శ్రీలంక జట్టు ఇటీవల పాకిస్తాన్ లో పర్యటించి మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్ లు ఆడింది. రెండు టెస్టుల సిరీస్ కూడా ఆడింది. కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి 1-0 స్కోరుతో సిరీస్ ను కైవసం చేసుకుంది.