Asianet News TeluguAsianet News Telugu

యంగ్ ఇండియా తొలి విజయం.. రాణించిన బౌలర్లు

IND vs NZ: ఇండియా-న్యూజిలాండ్ మధ్య  బే ఓవల్ వేదికగా ముగిసిన రెండో టీ20లో యంగ్ ఇండియా ఘన విజయంతో బోణీ కొట్టింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైనా రెండో మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా సేన జయకేతనం ఎగురవేసింది. 

India Beats New Zealand in 2nd T20I, Lead The Series With 1-0
Author
First Published Nov 20, 2022, 4:09 PM IST

టీ20 ప్రపంచకప్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్ ను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది.   న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా రెండో మ్యాచ్ లో  జయకేతనం ఎగురవేసింది.  భారత్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్.. 20 ఓవర్లలో126 పరుగులకే పరిమితమైంది.  ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ (52 బంతుల్లో 61, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా విజయం మాత్రం భారత్ నే వరించింది.   భారత బౌలర్లు సమిష్టిగా రాణించి  టీమిండియాకు విజయాన్ని అందించారు. 

భారీ లక్ష్య ఛేదనలో  కివీస్ కు రెండో బంతికే షాక్ తగిలింది.  ఆ జట్టు ఓపెనర్  ఫిన్ అలెన్ (0) ను  భువనేశ్వర్ ఔట్ చేశాడు.  దీంతో డిఫెన్స్ లోకి వెళ్లిన కివీస్ తొలి  పవర్ ప్లేలో నెమ్మదిగా ఆడింది. ఆరు ఓవర్లు ముగిసేప్పటికీ ఆ జట్టు స్కోరు  32-1 మాత్రమే. 

వాషింగ్టన్ సుందర్ వేసిన  ఏడో ఓవర్  లో 4, 4, 6 బాదిన  కాన్వే(25) , కేన్ మామలు జట్టు స్కోరుకు ఊపు తెచ్చే యత్నం చేశారు.  కానీ సుందర్ తన తర్వాతి ఓవర్లో  తొలి బంతికి కాన్వేను ఔట్ చేశాడు. తొలి బంతికే  ఫోర్ కొట్టిన గ్లెన్ ఫిలిప్స్ (12) ను చాహల్ పెవిలియన్ కు పంపాడు. పది ఓవర్లకు  కివీస్ స్కోరు 71-3గా ఉంది.  

ఈ క్రమంలో భారత స్పిన్నర్లు రాణించడంతో కివీస్ స్కోరు మరీ నెమ్మదిగా సాగింది. దీపక్ హుడా.. 13వ ఓవర్లో  డారిల్ మిచెల్ (10) ను ఔట్ చేశాడు. తర్వాత చాహల్.. నీషమ్ (0) ను వెనక్కి పంపాడు.  15ఓవర్లకు  కివీస్..  5 వికెట్లు కోల్పోయి  98 పరుగులు మాత్రమే చేసింది. 

 

16వ ఓవర్ వేసిన సిరాజ్.. సాంట్నర్ (2) ను ఔట్ చేశాడు. అదే సిరాజ్ వేసిన  18వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ కొట్టి హఫ్ సెంచరీ చేసిన కేన్ విలిమయ్సన్.. చివరి బంతికి బౌల్డ్ అయ్యాడు.  దీపక్ హుడా వేసిన  19వ ఓవర్లో రెండో బంతికి  ఇష్ సోధి (0) ని పంత్ స్టంప్ అవుట్ చేశాడు. మూడో బంతికి సౌథీ కూడా పెవిలియన్ చేరాడు. ఐదో బంతికి  మిల్నే ఇచ్చిన క్యాచ్ ను అర్ష్‌‌దీప్ అందుకోవడంతో కివీస్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్..  65 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.  

భారత బౌలర్లలో దీపక్ హుడాకు నాలుగు వికెట్లు దక్కగా..  చాహల్, సిరాజ్ రెండేసి వికెట్లు తీశారు. భువీ, వాషింగ్టన్ సుందర్ కు తలా ఒక వికెట్ దక్కింది. ఈ విజయంతో భారత్  మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఆఖరి మ్యాచ్  ఈనెల 22న జరుగుతుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios