Asianet News TeluguAsianet News Telugu

ఏం తమాషాగా ఉందా... గీత దాటిన భారత్, పాకిస్తాన్‌ ఇద్దరిపై భారీ ఫైన్ వేసిన ఐసీసీ...

స్లో ఓవర్ రేటు కారణంగా భారత్, పాకిస్తాన్ జట్లకు 40 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించిన ఐసీసీ... 

India and Pakistan fined by ICC for maintaining slow over-rates in Asia Cup 2022
Author
First Published Aug 31, 2022, 5:08 PM IST

భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌కి 8 నెలల ముందు టికెట్లు ఆన్‌లైన్ బుకింగ్‌లో పెడితే మూడు నిమిషాల్లో అమ్ముడైపోయాయి. ఈ మ్యాచ్‌కి ఉన్న క్రేజ్ కారణంగా స్టాండ్స్‌ని పెంచి, దాదాపు 90 వేల మంది మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియానికి అనుమతించాలని అనుకుంటోంది క్రికెట్ ఆస్ట్రేలియా...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత భారత్, పాకిస్తాన్ జట్లు తొలిసారి ఆసియా కప్ 2022 టోర్నీలో తలబడ్డాయి. ఈ మ్యాచ్ కూడా తీవ్ర ఉత్కంఠభరితంగా ఆఖరి ఓవర్ వరకూ సాగింది. హోరాహోరీగా సాగిన దాయాదుల పోరులో ఇరు జట్లు, ఐసీసీ స్లో ఓవర్ రేటు రూల్‌ని అతిక్రమించాయి...

ఐసీసీ రూల్ ప్రకారం గంటలో 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. అంటే టీ20 ఇన్నింగ్స్ ముగియడానికి గంటన్నర సమయం అనుమతి ఉంటుంది. అయితే భారత జట్టు, పాక్ ఇన్నింగ్స్‌ని ముగించడానికి దాదాపు 2 గంటల సమయం తీసుకుంది. పాకిస్తాన్ పరిస్థితి కూడా సేమ్... 

తొలి ఓవర్‌లోనే కెఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ అయినా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నారు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కాసేపు, ఆ తర్వాత రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా... పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు...

దీంతో బౌలింగ్, ఫీల్డింగ్ మార్పుల కోసం చాలా సమయం తీసుకున్నాడు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్. దీంతో ఇరు జట్లకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. ఇరు జట్లకీ 40 శాతం మ్యాచ్ కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. 

భారత జట్టుకి 13.20 లక్షల రూపాయల జరిమానా పడగా, పాక్ జట్టుకి మాత్రం 5.92 లక్షల రూపాయల జరిమానా మాత్రమే పడనుంది. జరిమానాలో వ్యత్యాసం ఉండడానికి కారణం భారత క్రికెటర్ల కంటే పాక్ క్రికెటర్లకు వచ్చే మ్యాచ్ ఫీజు తక్కువగా ఉండడమే. 

 స్లో ఓవర్ రేటు విషయంలో ఐసీసీ చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటోంది. నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయకపోతే పవర్ ప్లే మాదిరిగా నలుగురు ఫీల్డర్లను రింగ్‌ బయట ఫీల్డింగ్ చేసేందుకు అనుమతిస్తారు... టీమిండియా ఆఖరి ఓవర్‌లో కూడా ఇదే విధంగా బౌలింగ్ చేసింది... హంగ్ కాంగ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ ఇదే తప్పు రిపీట్ అయితే జరిమానా రెట్టింపు అవుతుంది...

షెడ్యూల్ సమయం కంటే రెండు ఓవర్లు తక్కువ వేశాయి ఇరు జట్లు. ఐసీసీ ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం ఒక్కో ఓవర్ తక్కువ వేస్తే 20 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా పడుతుంది. రెండు ఓవర్లకు కలిసి 40 శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించింది ఐసీసీ. ఇదే టోర్నీలో స్లో ఓవర్ రేటును కొనసాగిస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఓ మ్యాచ్ నిషేధం పడే అవకాశం కూడా ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios