Asianet News TeluguAsianet News Telugu

కెప్టెన్‌గా సంజూ శాంసన్ సూపర్ సక్సెస్... న్యూజిలాండ్‌ ఏ జట్టును క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా...

న్యూజిలాండ్ ఏతో ఆఖరి వన్డేలో 106 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న భారత ఏ జట్టు... వన్డే సిరీస్‌కి క్లీన్ స్వీప్ చేసిన సంజూ శాంసన్ టీమ్...

India A won the One-day series 3-0 against New Zealand,  Captain Sanju Samson
Author
First Published Sep 27, 2022, 6:34 PM IST

భారత ఏ జట్టు కెప్టెన్‌గా సంజూ శాంసన్ సూపర్ సక్సెస్‌ని అందుకున్నాడు. న్యూజిలాండ్ ఏ జట్టుతో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది భారత ఏ జట్టు. చెన్నైలో జరిగిన మూడో వన్డేలో భారత ఏ జట్టు 106 పరుగుల భారీ తేడాతో ఘన విజయం అందుకుంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, రాహుల్ త్రిపాఠి కలిసి మొదటి వికెట్‌కి 55 పరుగుల భాగస్వామ్యం అందించారు. 35 బంతుల్లో 8 ఫోర్లతో 39 పరుగులు చేసిన అభిమన్యు ఈశ్వరన్‌ని మాథ్యూ ఫిషర్ అవుట్ చేయగా 25 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, జో వాకర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

కెప్టెన్ సంజూ శాంసన్ 68 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 62 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి అవుట్ కాగా మరో తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు...

రిషీ ధావన్ 46 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రాజ్ భవ 4 పరుగులు చేయగా శార్దూల్ ఠాకూర్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసి మెరుపు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కుల్దీప్ 5 పరుగులు, రాహుల్ చాహార్ 1 పరుగు చేయగా కుల్దీప్ సేన్ డకౌట్ అయ్యాడు...

285 పరుగుల భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ ఏ జట్టుకి మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కి 52 పరుగులు జోడించారు. చాడ్ బోవ్స్ 20 పరుగులు చేసి అవుట్ కాగా 7 బంతుల్లో 2 పరుగులు చేసిన రచిన్ రవీంద్రని రాహుల్ చాహార్ క్లీన్ బౌల్డ్ చేశాడు...

మార్క్ చాప్‌మన్ 11 పరుగులు చేయగా రాబర్ట్ ఓడెన్నెల్ 6 పరుగులు చేశాడు. 10 పరుగులు చేసిన టాప్ బ్రూస్‌ని రాహుల్ త్రిపాఠి అవుట్ చేయగా 29 పరుగులు చేసిన మైకేల్ రిప్పన్, రాజ్ భవ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. లోగన్ వాన్ బీక్ 6, జో వాకర్ 1, జాకబ్ డఫ్పీ 1 పరుగు చేసి అవుట్ కాగా మైకేల్ ఫిషర్‌ని రాజ్ భవ డకౌట్ చేశాడు...

దీంతో 38.3 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్ ఏ జట్టు. అండర్ 19 వరల్డ్ కప్ 2022 కుర్రాడు రాజ్ భవ 5.3 ఓవర్లు బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్‌, రాహుల్ చాహర్‌కి చెరో 2 వికెట్లు దక్కాయి. రిషి ధావన్, రాహుల్ త్రిపాఠి చెరో వికెట్ తీశారు...

ఈ సిరీస్‌లో 120 పరుగులు చేసిన సంజూ శాంసన్, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు. 7 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios