బెంగళూరు: నేటి మ్యాచులో ఫీల్డింగ్ చేస్తూ శిఖర్ ధావన్ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. నొప్పితో విలవిలలాడుతూ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు. అతడు మనకు కనిపించినప్పుడు మాత్రం ఒక పట్టి వేసుకొని కనిపించాడు.  

అతడి బదులు చాహల్ ఫీల్డింగ్ చేసాడు. భారత ఇన్నింగ్స్ ను కూడా అతడు ప్రారంభించలేదు. అతడి బదులు లాస్ట్ మ్యాచ్ హీరో రాహుల్ ఓపెనింగ్ చేసాడు. రోహిత్ శర్మతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. గత మ్యాచులోనే నెంబర్ 5లో వచ్చి అదరగొట్టిన రాహుల్ ఇప్పుడు ఇలా ఓపెనర్ గా వచ్చి ఆడుతున్నాడు. 

గత మ్యాచులో అవతలి ఎండ్ లో వికెట్లు  పడుతున్నప్పటికీ రాహుల్ మాత్రం ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఆటలో పూర్తిగా నిమగ్నమయిపోయి భారత్ స్కోర్ బోర్డును పరుగులుపెట్టించాడు. గ్రౌండు నలుదిక్కులా షాట్లు కొడుతూ అభిమానులను ఉర్రూతలూగించారు. 

అసలు సాధారణంగా కెఎల్ రాహుల్ అంటే... టీం లోకి వచ్చిన కొత్తలో టెస్టు బ్యాట్స్ మెన్ మాత్రమే. ఆతర్వాత నెమ్మదిగా వన్డేల్లో కూడా ఓపెనర్ గా కనిపించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఐపీఎల్ పుణ్యమాని అతనిలోని భయంకరమైన టి 20 ఫార్మటు ఆటగాడు బయటకొచ్చాడు. 

ఇలా అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్న రాహుల్ ఇప్పుడు ఏకంగా ఏ స్థానంలోనయినా ఆడే పొజిషన్ కు చేరుకున్నాడు. రాహుల్ ఓపెనర్ గా, ఇటు నెంబర్ 4 బ్యాట్స్ మెన్ గా, తాజా మ్యాచులో ఫినిషర్ అవతారం కూడా ఎత్తాడు. 

Also read: టీమిండియా: రిషబ్ పంత్ కు కేఎల్ రాహుల్ ముప్పు

ఇలా ఏ స్థానంలోనయినా బ్యాటింగ్ చేయగలగడం ఒక కళ. ఫస్ట్ మ్యాచులో గనుక తీసుకుంటే... కోహ్లీ తన రెగ్యులర్ స్థానమైన 3వ స్థానంలో రాలేదు కాబట్టే భారత్ మంచును కోల్పోవాలిసి వచ్చిందని అందరూ అన్నారు. 

ఇలా ఏ స్థానంలోనయినా ఆడగలిగే ఆటగాడు గనుక ఉంటే....టీం కు ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. కావాల్సి వచ్చినప్పుడు బాధ్యతగా, చివర్లో బీభత్స ఇన్నింగ్స్ లను కూడా ఆడగలగడం ప్లేయర్ విశిష్టతను తెలియజేస్తుంది. 

ఇక ఇలా ఏ స్థానంలోనయినా ఒదిగిపోయి ఆడగలగడం ప్లేయర్ గా రాహుల్ కి జట్టులో స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది. దానితోపాటు రాహుల్ వికెట్ కీపర్ కూడా అవడం వల్ల భారత్ కి ఇంకో ఎక్స్ట్రా ప్లేయర్ ని కూడా సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ దక్కుతుంది. 

ఇప్పుడు శిఖర్ ధావన్ గాయంతో బాధపడుతున్నాడు. ఇంకొక్క వారం రోజుల్లో న్యూజీలాండ్ పర్యటన ప్రారంభమవనుంది. ఈ నేపథ్యంలో ధావన్ పరిస్థితేంటని అందరూ ఆందోళన చెందుతున్నారు.