విశాఖపట్నం: దక్షిణాఫ్రికాపై విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టు మ్యాచులో విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్ రోహిత్ శర్మను ప్రశంసలతో ముంచెత్తాడు. రోహిత్ శర్మ ఈ టెస్టు మ్యాచులో రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్సులో 176 పరుగులు, రెండో ఇన్నింగ్సులో 127 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ప్రదర్శన అసాధారణమైందని విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. రోహిత్ శర్మ ఓపెనర్ భాగస్వామి మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ ను కూడా కోహ్లీ కొనియాడాడు. మయాంక్ అగర్వాల్ అద్భుతంగా ఆడాడని ఆయన అన్నాడు.

స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా 14 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరిని కూడా కోహ్లీ ప్రశంసించాడు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని ప్రదర్శించారని ఆయన అన్నాడు. అశ్విన్, జడ్డూ మరో సారి బాగా ఆడారని అన్నాడు.

రెండో ఇన్నింగ్సులో షమీ బాగా బౌలింగు చేశాడని చెప్పాడు. సహజంగానే బ్యాట్స్ మెన్ హీరోలుగా నిలిచారని అన్నాడు. రోహిత్ శర్మపై విశ్వాసం ఉంచి విరాట్ కోహ్లీ ఓపెనర్ గా దించాడు. కెప్టెన్ తనపై ఉంచిన విశ్వాసాన్ని రోహిత్ శర్మ నిలబెట్టుకోవడమే కాకుండా టెస్టు మ్యాచుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. 

దక్షిణాఫ్రికాపై విశాఖపట్నంలో జరిగిన తొలి టెస్టు మ్యాచును 203 పరుగుల తేడాతో ఇండియా గెలుచుకుంది. దీంతో సిరీస్ లో 1-0 స్కోరుతో ముందంజలో నిలిచింది.