IND vs SA : మరోసారి పోరాటానికి సిద్ధమైన టీమిండియా.. ఈ సారైనా టెస్టు సిరీస్ ను నెగ్గుతుందా?
IND vs SA Test Records: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డిసెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లూ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తొలిసారిగా దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలనే కలతో టీమిండియా ఈ సిరీస్ కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా.. సొంత మైదానంలో టీమిండియాపై బలమైన రికార్డును కొనసాగించేందుకు దక్షిణాఫ్రికా సన్నాహాలు చేస్తోంది.
IND vs SA Test Records: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 1-1 తో సమం చేసింది. అనంతరం 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడిన టీమిండియా దక్షిణాఫ్రికాపై అదిపత్యం చేలాయించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడూ రోహిత్ శర్మ నేతృత్వంలో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు రంగంలోకి దిగనుంది. సెంచూరియన్‌లోని చారిత్రాత్మక సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.
కాగా.. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాలనీ, సరికొత్త చరిత్ర నాంది పలకాలని టీమిండియా భావిస్తుంది. దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్ కైవసం చేసుకుని గత రికార్డులను బ్రేక్ చేయాలని రోహిత్ సేన పట్టుదలతో సమరానికి సిద్దమవుతోంది. గత రికార్డులను పరిశీలిస్తే.. 1992-93 నుంచి 2021-22 వరకు దక్షిణాఫ్రికాలో భారత్ 8 టెస్టు సిరీస్‌లాడింది. ఈ ఎనిమిది సిరీస్‌ల్లో టీమిండియా ఏడింటిలో ఓడిపోయింది. 2010-11లో జరిగిన సిరీస్ మాత్రమే డ్రాగా ముగించింది.
ఈ ఎనిమిది టెస్టుల సిరీస్‌లో టీమిండియా దక్షిణాఫ్రికాలో మొత్తం 23 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ 23 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే టీమిండియా గెలుపొందింది. 12 మ్యాచ్‌లు ఓడిపోగా, 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇక్కడ భారత జట్టు చివరిసారిగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడింది. ఆ తర్వాత విరాట్ కోహ్లి సారథ్యంలో టీమిండియా వచ్చింది. భారత జట్టు 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా టెస్టు క్రికెట్‌లో విజయపతాకాన్ని ఎగురవేసిన టీమిండియా దక్షిణాఫ్రికాలో మాత్రం విజయాన్ని సాధించలేకపోతుంది. సఫారీ జట్టుపై టీమిండియా గెలువడం ఎంత కష్టమో ఈ లెక్కలను చూస్తేనే అర్థమవుతోంది. అయితే.. సక్సెస్ పుల్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఈ టెస్ట్ సిరీస్‌ను గెలుపొందుతుందా? గత రికార్డులను బద్దలు కొడుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఓవరాల్ ఇరు జట్ల రికార్డులను పరిశీలిస్తే.. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు మొత్తం 42 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమిండియా 15 మ్యాచ్‌లు గెలిచి 17 ఓడింది. ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి.