IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరిన టీమిండియా.. జట్టులోకి రోహిత్-విరాట్
India vs South Africa: ప్రస్తుతం భారత జట్టు డిసెంబర్ 10 నుంచి సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో పాల్గొంటుంది. అలాగే, వన్డే, టెస్ట్ సిరీస్ కోసం ఇరు జట్లు పోటీ పడనున్నాయి.
India Cricket Team: టీమిండియా బుధవారం ఉదయం దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరింది. జట్టుతో పాటు చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, అతని సహాయక సిబ్బంది ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు తొలి మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు, చివరగా రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో టీ20, వన్డే సిరీస్లకు వెటరన్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. ఈ రెండు సిరీస్ ల నుంచి విరామం కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, హిట్ మన్ రోహిత్ శర్మకు టీ20, వన్డేల నుంచి విరామం ఇచ్చారు. డిసెంబర్ 20న జరిగే ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు జట్టులో చేరనున్నారు. దక్షిణాఫ్రికాకు మూడు ఫార్మాట్లకు కలిపి 31 మంది ఆటగాళ్లు ఎంపికయ్యారు. మూడు ఫార్మాట్లలో రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ముఖేష్ కుమార్లకు మాత్రమే చోటు దక్కించుకున్నారు.
మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు..
భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నిర్ణయించారు. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్ వన్డేల్లో జట్టుకు సారథ్యం వహించనున్నాడు. టెస్టు సిరీస్ పగ్గాలు రోహిత్ శర్మ చేతిలో ఉన్నాయి. కాగా, రాహుల్ ద్రావిడ్ సహా అతని కోచింగ్ స్టాఫ్ పదవీకాలాన్ని టీ20 వరల్డ్ కప్ వరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి పొడిగించింది. వచ్చే ఏడాది జులైలో వెస్టిండీస్, అమెరికాలో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. వన్డే ప్రపంచకప్ ముగియడంతో ద్రవిడ్, అతని కోచింగ్ స్టాఫ్ పదవీకాలం ముగిసింది. రానున్న మెగా టోర్నీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన 5 టీ20ల సిరిస్ లో ప్రధాన కోచ్ బాధ్యతలను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ కు అప్పగించారు. సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్ లతో కూడిన వన్డే జట్టు కూడా త్వరలోనే బయలుదేరనుంది. టీ20 సిరీస్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తిరిగి రానున్నాడు. డిసెంబర్ 10 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే డిసెంబర్ 17న జరగనుంది. డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.
సౌతాఫ్రికా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలిచేనా..?
సౌతాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు ప్రదర్శన ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విధంగా ఏమీలేదు. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు టెస్టు సిరీస్ గెలవలేదు. ఆఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటివరకు 8 టెస్టు సిరీస్లు ఆడింది. వీటిలో ఒకటి డ్రా కాగా, టీమ్ఇండియా 7 సిరీస్ లలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.