Asianet News TeluguAsianet News Telugu

చిన్న గ్రౌండ్ లో పెద్ద టార్గెట్.. మూడో టీ20లో భారత బౌలర్లు విఫలం.. టీమిండియా ముందు భారీ లక్ష్యం

IND vs SA T20I Live: ఇప్పటికే సిరీస్ గెలిచామన్న ధీమానో లేక నామమత్రపు మ్యాచ్ అన్న అలసత్వమో గానీ భారత బౌలర్లు పట్టువిడిచారు. ఇండోర్ లో జరుగుతున్న చివరి టీ20లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు వీరబాదుడు బాదడంతో టీమిండియా ముందు భారీ స్కోరు ఉంచింది. 

IND vs SA T20I Live: Rilee Rossow Maiden Hundred, South Africa Sets  228 Target Behind India
Author
First Published Oct 4, 2022, 8:55 PM IST

ఇండియా-సౌతాఫ్రికా మధ్య ఇండోర్ (మధ్యప్రదేశ్) వేదికగా జరుగుతున్న  మ్యాచ్ లో భారత్ ముందు  సఫారీ జట్టు భారీ టార్గెట్ నిలిపింది.  మిగతా  స్టేడియాలతో పోలిస్తే ఇండోర్ క్రికెట్  గ్రౌండ్ చాలా చిన్నది. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఇప్పటికే సిరీస్ గెలిచామన్న ధీమానో లేక నామమత్రపు మ్యాచ్ అన్న అలసత్వమో గానీ భారత బౌలర్లు పట్టువిడిచారు. తొలి రెండు  మ్యాచ్ లలో విఫలమై రిలీ  రోసో (48 బంతుల్లో 100 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) తో పాటు  గత మ్యాచ్ లో రాణించిన డికాక్ (43 బంతుల్లో 68, 6 ఫోర్లు, 4 సిక్సర్లు)  కూడా రెచ్చిపోయి ఆడాడు. ఆఖర్లో ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్  కూడా మెరుపులు మెరిపించడంతో  నిర్ణీత 20 ఓవర్లలో  దక్షిణాఫ్రికా..  3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన  దక్షిణాఫ్రికా ఆట మొదటి ఓవర్ నుంచే దూకుడైన ఆట ఆడింది. సిరాజ్ వేసిన రెండో ఓవర్లో డికాక్.. 6, 4 తో బాదుడుకు శ్రీకారం చేశాడు. ఆ తర్వాత  చహార్ ఓవర్లో కూడా సిక్సర్ బాదాడు. అయితే  ఉమేశ్ యాదవ్ భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఫామ్ లో లేని కెప్టెన్ బవుమా (3) ను అతడు ఔట్ చేశాడు. 

బవుమా స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రోసో తో కలిసి డికాక్ రెచ్చిపోయాడు. ఇద్దరూ ఫోర్లు, సిక్సర్ల పండుగ చేసుకున్నారు.  తాను ఎదుర్కున్న  మూడు, నాలుగో బంతికే రెండు బౌండరీలు బాదిన రోసో అదే జోరును ఇన్నింగ్స్ చివరివరకు కొనసాగించాడు. పవర్ ప్లే ముగిసేసరికి సౌతాఫ్రికా.. 1 వికెట్  నష్టానికి 48 పరుగులు చేసింది. 

ఉమేశ్ యాదవ్ వేసిన పదో ఓవర్ మూడో బంతికి  సిక్సర్ కొట్టిన డికాక్.. ఈ సిరీస్ లో మరో హాఫ్ సెంచరీ సాధించాడు.  33 బంతుల్లోనే అర్థ సెంచరీ చేసిన డికాక్.. హర్షల్ పటేల్ వేసిన  తర్వాత ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో చెలరేగాడు. మరోవైపు రోసో కూడా రెచ్చిపోయి ఆడటంతో దక్షిణాఫ్రికా స్కోరు 11వ ఓవర్లోనే   వంద పరుగులు దాటింది. అయితే  ఉమేశ్ యాదవ్ వేసిన 13వఓవర్ తొలి బంతికి డీప్ మిడ్ వికెట్ దిశగా బంతిని కొట్టిన డికాక్.. రెండో పరుగు కోసం యత్నంచి రనౌట్ అయ్యాడు. కానీ అప్పటికే దక్షిణాఫ్రికా  పటిష్ట  స్థితిలో నిలిచింది. 

 

అక్షర్ పటేల్ వేసిన 14వ ఓవర్లో మూడో బంతిని సిక్సర్ బాదడం ద్వారా రోసో అర్థ సెంచరీ కూడా పూర్తయింది. ఆ తర్వాత భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. స్టబ్స్ (23, రోసో కలిసి  ధాటిగా  ఆడటంతో స్కోరు వేగం రాకెట్ స్పీడ్ తో పెరిగిపోయింది.   హాఫ్ సెంచరీ పూర్తయ్యాక రోసో మరింత రెచ్చిపోయాడు. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీ  లైన్ దాటించాడు. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్లో 6, 4 బాది 90లలోకి ప్రవేశించాడు. ఇక చహార్ వేసిన  చివరి ఓవర్లో  రెండో బంతికి సింగిల్ తీయడం ద్వారా రోసో  తన టీ20 కెరీర్ లో మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.  

చివర్లో వచ్చిన డేవిడ్  మిల్లర్ (4 బంతుల్లో 18, 3 సిక్సర్లు) కూడా మూడు భారీ సిక్సర్లు బాదడంతో  దక్షిణాఫ్రికా భారీ స్కోరు (227-3) సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ విజయం  సాధించాలంటే  120 బంతుల్లో  228 పరుగులు సాధించాలి. భారత బౌలర్లలో చహార్, ఉమేశ్ యాదవ్ లు తలో వికెట్ తీశారు. మిగిలినవాళ్లు దారాళంగా పరుగులిచ్చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios