IND vs SA ODI: ఇరు జట్ల మధ్య ముగిసిన టీ20 సిరీస్ ను భారత్ 2-1తో దక్కించుకోగా  వన్డే సిరీస్ లో జరిగిన రెండు మ్యాచ్ లలో భారత్, దక్షిణాఫ్రికా తలా ఓ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేశాయి. దీంతో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 

ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరింది. ఇరు జట్ల మధ్య ముగిసిన టీ20 సిరీస్ ను భారత్ 2-1తో దక్కించుకోగా వన్డే సిరీస్ లో జరిగిన రెండు మ్యాచ్ లలో భారత్, దక్షిణాఫ్రికా తలా ఓ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేశాయి. దీంతో నేడు ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడో వన్డే కీలకంగా మారనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు రానుంది. వర్షం వల్ల 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో పిచ్ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మార్పులేమీ లేవు. గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే భారత్ బరిలోకి దిగుతున్నది. కానీ దక్షిణాఫ్రికా మాత్రం మూడు మార్పులు చేసింది. గత మ్యాచ్ లో బవుమా స్థానంలో సారథిగా ఉన్న కేశవ్ మహారాజ్ కూడా ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. బవుమా, షంషి, మహారాజ్ ల స్థానంలో మార్కో జాన్సేన్, పెహ్లుక్వాయో, రీజా హెండ్రిక్స్ ఆడుతున్నారు. డేవిడ్ మిల్లర్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. 

లక్నోలో జరిగిన తొలి వన్డేలో ఓడిన భారత జట్టు.. రాంచీలో ముగిసిన రెండో వన్డేలో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న శ్రేయాస్ అయ్యర్ సెంచరీతో కదం తొక్కగా ఇషాన్ కిషన్ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరితో పాటు టాపార్డర్ బ్యాటర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ కూడా విజృంభిస్తే భారత్ కు తిరుగుండదు.

బౌలింగ్ లో అవేశ్ ఖాన్ విఫలమవుతున్నాడు. గత మ్యాచ్ లో సిరాజ్ ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్ లో కూడా సిరాజ్ తన ఫామ్ కొనసాగిస్తే దక్షిణాఫ్రికాను నిలువరించడం పెద్ద కష్టమేం కాదు. ప్రపంచకప్ కు ముందు దక్షిణాఫ్రికా ఆడుతున్న చివరి వన్డే కూడా ఇదే కావడంతో ఆ జట్టు విజయంతో ఆసీస్ కు పయనమవ్వాలని భావిస్తున్నది. 

తుది జట్లు : 

భారత్ : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ 

దక్షిణాఫ్రికా : డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, రీజా హెండ్రిక్స్, మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, మార్కో జాన్సేన్, పెహ్లుక్వాయో, ఫార్ట్యూన్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్త్జ్