India Vs South Africa: రెండో ఇన్నింగ్స్ లో 85 పరుగులు చేయడంతో టీమిండియా  ఆధిక్యం ప్రస్తుతానికి 58 పరుగులకు చేరింది. ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్ అయింది. శార్దూల్ ఠాకూర్ 7 వికెట్లు తీసి కొత్త చరిత్ర నెలకొల్పాడు. 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. వాండరర్స్ వేదికగా నిర్వహిస్తున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకే ఆలౌటైనా.. తర్వాత దక్షిణాఫ్రికాను కూడా అడ్డుకుంది. ఆ జట్టును 229 పరుగులకే ఆలౌట్ చేసి ఆ పై రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లు ఆడి 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. ఫామ్ లో ఉన్న టీమిండియా ఓపెనర్లు కెఎల్ రాహుల్ (8), మయాంక్ అగర్వాల్ (23) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దక్షిణాఫ్రికా బౌలర్లు జాన్సెన్, ఒలివర్ తలో వికెట్ పడగొట్టారు. 

ఓపెనర్లు నిష్క్రమించిన తర్వాత క్రీజులోకి వచ్చిన టీమిండియా వెటరన్ ఆటగాళ్లు ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే భారత్ మరో వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. కొద్దికాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతూ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న ఈ ఇద్దరూ నిలకడగా బ్యాటింగ్ చేశారు. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో పుజారా 3 పరుగులు చేయగా.. రహానే కెరీర్ లో తొలిసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఈ ద్వయం నిలకడగా ఆడుతున్నది. 

Scroll to load tweet…

కెఎల్ రాహుల్ నిష్క్రమించిన తర్వాత వచ్చిన పుజారా.. 42 బంతులాడి 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పుజారా చేసిన పరుగులలో 28 పరుగులు (7 బౌండరీలు) ఫోర్ల రూపంలోనే రావడం గమనార్హం. ఇక రహానే కూడా క్రీజులో నిలదొక్కుకునేందుకు కష్టపడుతున్నాడు. 22 బంతులాడిన అతడు.. 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో ఈ జంట మీదే భారత జట్టు ఆశలు పెట్టుకుంది. మూడో రోజు ఈ ఇద్దరూ ఎంత ఎక్కువ సేపు ఉంటే అది వారి టెస్టు కెరీర్ కు, టీమిండియాకు మంచిది. 

రెండో ఇన్నింగ్స్ లో 85 పరుగులు చేయడంతో టీమిండియా ఆధిక్యం ప్రస్తుతానికి 58 పరుగులకు చేరింది. ఇదిలాఉండగా.. తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 229 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు తరఫున కీగన్ పీటర్సన్ (62) టాప్ స్కోరర్. బవుమా (51), ఎల్గర్ (28) ఆదుకున్నారు. టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్.. దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు.

Scroll to load tweet…

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 17.5 ఓవర్లు వేసిన అతడు 61 పరుగులిచ్చి 7 వికెట్లు తీసుకోవడం విశేషం. ఒక భారత, ఆసియా ఖండపు బౌలర్ దక్షిణాఫ్రికాలో ఏడు వికెట్ల ప్రదర్శన చేయడం ఇదే ప్రథమం. ఠాకూర్ తో పాటు షమీ కి రెండు వికెట్లు దక్కగా బుమ్రా ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 202 పరుగులకే ఆలౌట్ అయిన విషయం విదితమే.