India vs South Africa 5th T20I: వర్షం కారణంగా ఐదో టీ20ని రద్దు చేసిన అంపైర్లు... ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో చెరో రెండు మ్యాచులు గెలిచి డ్రా చేసుకున్న ఇరు జట్లు...
సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్ గెలవాలనే టీమిండియా కల నెరవేరలేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న డిసైడర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో తొలి రెండు మ్యాచుల్లో సౌతాఫ్రికా, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో టీమిండియా గెలవడంతో సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది...
టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మ్యాచ్ ఆరంభమయ్యే సమయానికి వర్షం కురువడం మొదలైంది. దీంతో కాసేపు మ్యాచ్‌ని వాయిదా వేసిన అంపైర్లు, కొద్ది సేపటి తర్వాత వర్షం తగ్గడంతో చెరో ఓవర్ కుదించి 19 ఓవర్ల పాటు మ్యాచ్‌ని నిర్వహించేందుకు సమాయత్తమయ్యారు...
బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకి మెరుపు ఆరంభం అందించారు భారత ఓపెనర్లు. తొలి బంతికి పరుగులేమీ రాకపోగా ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు ఇషాన్ కిషన్. మొదటి ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి. లుంగి ఇంగిడి వేసిన రెండో ఓవర్ ఆఖరి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించిన ఇషాన్ కిషన్... క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
7 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇషాన్ కిషన్. ఆ తర్వాత 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసిన మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా లుంగి ఇంగిడి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 3.3 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది భారత జట్టు. ఈ సమయంలో మరోసారి వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌కి అంతరాయం కలిగింది...
వర్షం తగ్గుతుందేమోనని గంటన్నరకు పైగా ఎదురుచూసిన అంపైర్లు, ఎంతకీ వరుణుడు శాంతించకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సిరీస్ డిసైడర్ రద్దయ్యింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రా చేసుకున్న రెండో భారత కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్...
ఇంతకుముందు 2019లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ని 1-1 తేడాతో డ్రా చేసుకుంది. ఆ సిరీస్‌లోనూ వర్షం కారణంగా ధర్మశాలలో జరగాల్సిన టీ20 మ్యాచ్ రద్దు కావడం విశేషం. సిరీస్‌లో 6 వికెట్లు తీసిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ అవార్డు గెలిచాడు.
