Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: సెంచరీ సంగతి దేవుడెరుగు.. డకౌట్లలో రికార్డులు నెలకొల్పుతున్న విరాట్ కోహ్లి

Virat Kohli Duck Out:  పరుగుల యంత్రం విరాట్ కోహ్లి అభిమానులకు ఆయన శతకం చేస్తే చూడాలనే కోరిక ఇప్పట్లో తీరేలా లేదు.  సౌతాఫ్రికా వన్డే సిరీస్ లో ఎలాగైనా సెంచరీ కొడతాడని వేయి కండ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు కోహ్లి తీరని వేధనను మిగుల్చుతున్నాడు.  

Ind Vs SA 2nd ODI: Virat Kohli Registers record 31st Duck In His International Career
Author
Hyderabad, First Published Jan 21, 2022, 4:28 PM IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఆట నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. ఇన్నాళ్లు కెప్టెన్సీ భారమని  కారణాలు చూపినా ఇప్పుడు ఆ బాధ్యతలు కూడా అతడిపై లేవు.  సారథ్య బాధ్యతలు లేకపోవడంతో కోహ్లి ఇక పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఆడతాడని, మునపటి కోహ్లిని  చూస్తామని అతడి  అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా వేచి చూశారు. కానీ  కోహ్లి మాత్రం వాళ్లు అతడిపై పెట్టుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ అదే రీతిలో ఔటవుతున్నాడు. ఈ సిరీస్ లో తప్పక సెంచరీ చేస్తాడని, సుమారు రెండేండ్లుగా ఎదురుచూస్తున్న 71 వ సెంచరీ ఈ సిరీస్ తో పూర్తి చేస్తాడని భావించినా.. కోహ్లి మాత్రం రెండో వన్డేలో డకౌట్ గా వెనుదిరిగాడు. 

సౌతాఫ్రికాతో  పార్ల్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో  కోహ్లి డకౌట్ అయ్యాడు. శిఖర్ ధావన్ నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన విరాట్.. ఐదు బంతులు ఎదుర్కుని  డకౌట్ అయ్యాడు. వన్డేలలో కోహ్లి డకౌట్ అవడం ఇది 14  వ సారి. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్ (టెస్టులు, వన్డేలు, టీ20 లు కలిపి) లో డకౌట్ అవడం ఇది 31 వ  సారి కావడం గమనార్హం. 

 

 టీమిండియా తరఫున  అత్యధిక సార్లు డకౌట్ అయిన వారిలో సచిన్ టెండూల్కర్ (34) ముందున్నాడు. ఆ తర్వాత కోహ్లి (31) ఉన్నాడు. తాజాగా అతడు వీరేంద్ర సెహ్వాగ్ (31) ను అధిగమించాడు. నాలుగో స్థానంలో బీసీసీఐ చీఫ్ గంగూలీ (29) ఉన్నాడు. 

ఇక వన్డేలలో కోహ్లి తొలిసారిగా ఓ  స్పిన్నర్ బౌలింగ్ లో  డకౌట్ అయ్యాడు. గతంలో విరాట్ 13 సార్లు  డకౌట్ కాగా.. అవన్నీ ఫాస్ట్ బౌలర్లకు దక్కినవే. దీంతో వన్డేలలో కోహ్లిని డకౌట్ చేసిన స్పిన్నర్ గా కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు. తొలి వన్డేలో 51 పరుగులు చేసిన కోహ్లి.. షంసీ బౌలింగ్ లో దక్షిణాఫ్రికా సారథి బవుమాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  రెండో వన్డేలో కూడా కోహ్లి ఇచ్చిన క్యాచ్ బవుమా చేతుల్లోకే వెళ్లింది. 

 అప్పుడు మూడు సెంచరీలు.. ఇప్పుడేమో... 

 భారత జట్టు 2018లో దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు విరాట్ కోహ్లి భీకర ఫామ్ లో ఉన్నాడు.  ఆ  పర్యటనలో టెస్టులతో పాటు వన్డేలలో కూడా కోహ్లి  వీరవిహారం చేశాడు. టీమిండియా 4-1తో గెలుచుకున్న ఆ వన్డే సిరీస్ లో కోహ్లి ఏకంగా మూడు వన్డే సెంచరీలు సాధించాడు. కానీ ఈ  పర్యటనలో కోహ్లి   ప్రదర్శన పేలవంగా సాగుతున్నది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో  చేసిన 72 పరుగులు మినహా ఇప్పటివరకు  ఈ సిరీస్ లో కోహ్లి ఆడిన ఇన్నింగ్సుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

కెప్టెన్సీ బరువు  దిగిపోయిన తర్వాత ఆడిన తొలి వన్డేలో 51 పరుగులు చేసి టచ్ లో కనిపించిన కోహ్లి.. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచుల సున్నాకే ఔటవడం అతడి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక ఈ సిరీస్ లో ఒక మ్యాచ్ మాత్రమే మిగిలుంది. ఆ  మ్యాచులో అయినా కోహ్లి శతక కరువును తీరుస్తాడా..? తాజా ప్రదర్శన చూస్తే మాత్రం అనుమానమే మరి...!! వన్డేలలో కోహ్లి ఆఖరు సెంచరీ చేసింది 2019 ఆగష్టు 14న.. ప్రత్యర్థి వెస్టిండీస్. అప్పట్నుంచి అభిమానులకు శతక నిరీక్షణ తప్పడం లేదు.

నిలకడగా ఆడుతున్న భారత్.. 

ఇక  పార్ల్ లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెఎల్ రాహుల్ సేన.. 30 ఓవర్లు ముగిసేసరికి  2 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కెప్టెన్ రాహుల్ (53 నాటౌట్), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (76 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత్ భారీ స్కోరుమీద కన్నేసింది. ఈ వన్డేలో గెలిస్తేనే సిరీస్ ను నిలబెట్టుకోగలం. లేకుంటే టెస్టు సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా గోవిందా గోవిందా... 
 

Follow Us:
Download App:
  • android
  • ios