Asianet News TeluguAsianet News Telugu

IND vs SA: లో స్కోరింగ్ థ్రిల్లర్‌‌లో టీమిండియాదే విక్టరీ.. రాణించిన సూర్య-రాహుల్

IND vs SA T20I: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య తిరువనంతపురం వేదికగా ముగిసిన తొలి టీ20లో టీమిండియా గెలుపుతో తొలి బోణీ కొట్టింది. లో స్కోరింగ్ థ్రిల్లర్ గా సాగిన ఈ మ్యాచ్ లో బౌలర్లు పండుగ చేసుకున్నారు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ రాణించారు. 

IND vs SA 1st T20I Live: India Beats South Africa By 8 Wickets, Lead the Series with 1-0
Author
First Published Sep 28, 2022, 10:18 PM IST

టీ20 క్రికెట్ అంటేనే  బ్యాటర్లు బాదుతుంటే బౌలర్లు బాధితులుగా  ఆకాశం వంక చూడటం తప్ప మరో గత్యంతరం లేని ఫార్మాట్. కానీ  చాలా రోజుల తర్వాత ఇందుకు విరుద్ధంగా మ్యాచ్ జరిగింది. తిరువనంతపురం వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య  ముగిసిన తొలి టీ20లో బౌలర్లు పండుగ చేసుకున్నారు. బ్యాటర్ల పప్పులేమీ ఉడకలేదు. ప్రపంచ అగ్రశ్రేణి బ్యాటర్లు సైతం  అలా వచ్చి ఇలా వెళ్లారు.  రాక రాక వచ్చిన అవకాశాన్ని ఇరుజట్ల బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. ఫలితం భారత్ కు అనుకూలంగా వచ్చినా ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బౌలర్లు అద్భుతంగా రాణించారు. పేస్ కు అనుకూలించిన పిచ్ పై భారత, దక్షిణాఫ్రికా పేసర్లు అదరగొట్టారు. 

సౌతాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్ కష్టపడాల్సి వచ్చింది.  వికెట్ల మీదకు దూసుకొచ్చిన బంతులను ఎదుర్కోవడానికి రోహిత్, కోహ్లీ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. చివరికి సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు, 3 సిక్సర్లు),కెఎల్ రాహుల్ (56 బంతుల్లో 51 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) లు నింపాదిగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. లక్ష్యాన్ని భారత్.. 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు కూడా  ఆదిలోనే షాకులు తప్పలేదు. రబాడా వేసిన తొలి ఓవర్లో  ఒక్క పరుగు కూడా రాలేదు. పిచ్ పేస్ కు అనుకూలిస్తుండటంతో రబాడా రెచ్చిపోయాడు. అతడు వేసిన  మూడో ఓవర్లో కెప్టెన్ రోహిత్ శర్మ (0) ఇచ్చిన క్యాచ్ ను క్వింటన్ డికాక్  డైవ్ చేస్తూ అందుకన్నాడు. 9 పరుగులకే భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది.  

మూడో ఓవర్లో భారత్ కు రెండు పరుగులు మాత్రమే రాగా.. పార్నెల్ వేసిన నాలుగో ఓవర్లో కూడా ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. క్రీజులో నిలదొక్కుకోవడానికి రాహుల్ ఇబ్బందిపడ్డాడు. కోహ్లీ  (9 బంతుల్లో 3) కూడా పరుగులు రాబట్టలేకపోయాడు.  ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రబాడా నాలుగు పరుగులే ఇచ్చాడు. పార్నెల్ వేసిన ఆరో ఓవర్లో కూడా ఒక్క పరుగే వచ్చింది. పవర్ ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి భారత్ స్కోరు వికెట్ నష్టానికి 17 పరుగులే.  

పవర్ ప్లే ముగిశాక ఏడో ఓవర్ వేసిన నోర్త్జ్..  తొలి బంతికే కోహ్లీని  ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తాను ఎదుర్కున్న రెండో బంతికే థర్డ్ మ్యాన్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని కూడా ఫైన్ లెగ్ దిశగా  మరో సిక్సర్ బాదాడు. ఆ ఓవర్లో 12 పరుగులొచ్చాయి. 

స్పిన్నర్లు వచ్చాక ఒక్కో పరుగు కూడబెట్టుకుంటూ వెళ్లిన టీమిండియా స్కోరు 11.1 ఓవర్లో 50 పరుగులకు చేరింది. కానీ తర్వాత  రాహుల్, సూర్యలు గేర్ మార్చారు. షంషీ వేసిన 12వ ఓవర్లో తొలి బంతికి రాహుల్ సిక్సర్ కొట్టగా  చివరి బంతిని సూర్య బౌండరీకి తరలించాడు. కేశవ్ మహారాజ్ వేసిన 13వ ఓవర్లో సూర్య మరో సిక్సర్ బాదాడు. నోర్త్జ్ వేసిన 15వ ఓవర్లో రాహుల్  సిక్సర్ కొట్టగా సూర్య ఫోర్ తో భారత స్కోరు  91 పరుగులకు చేరింది. రబాడా వేసిన 16వ ఓవర్లో కూడా  సూర్య  రెండు బౌండరీలు కొట్టాడు. షంషీ వేసిన 17వ ఓవర్లో సింగిల్ తీసిన సూర్య మరో హాఫ్ సెంచరీ నమోదు చేసుకన్నాడు. తర్వాత బంతికే రాహుల్  కూడా సిక్సర్ కొట్టి  హాఫ్ సెంచరీతో పాటు భారత్ కు విజయాన్ని అందించాడు. 

 

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులకే పరిమితమైంది.  ఆ జట్టు తరఫున కేశవ్ మహారాజ్ (41) ఒక్కడే టాప్ స్కోరర్. మార్క్రమ్ (25), పార్నెల్ (24) లు ఫర్వాలేదనిపించారు. అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీయగా  దీపక్ చాహర్, హర్షల్ పలట్ తలా రెండు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికాలో ఏకంగా నలుగురు టాపార్డర్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios