Asianet News TeluguAsianet News Telugu

IND vs SA: దీపక్ చాహర్, అర్ష్‌దీప్ ‘స్వింగ్’కు సఫారీ టాపార్డర్ కకావికలం.. పది పరుగులకే ఐదు వికెట్లు

IND vs SA T20I: దక్షిణాఫ్రికాతో తిరువనంతపురం వేదికగా జరగుతున్న  తొలి టీ20లో భారత పేసర్లు సఫారీ బ్యాటర్లను వణికించారు. స్కోరుబోర్డుపై పది పరుగులు కూడా చేరకముందే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

IND vs SA 1st T20I Live: Arshdeep Singh and Deepak Chahar On Fire in Thiruvananthapuram as South Africa Lost Half of The Batters
Author
First Published Sep 28, 2022, 7:54 PM IST

తిరువనంతపురం వేదికగా జరుగతున్న ఇండియా-సౌతాఫ్రికా  తొలి టీ20లో టీమిండియా పేసర్లు దుమ్ము దులిపారు.  మ్యాచ్ ప్రారంభమైందో లేదో తెలిసేలోపే సౌతాఫ్రికా వికెట్లు టపటపా నేలకూలాయి.  భారత యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్ లు అద్భుతమైన స్పెల్ తో ప్రపంచంలోనే ప్రమాదకర బ్యాటర్లుగా గుర్తింపు పొందిన క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ లను పెవిలియన్ చేర్చారు. స్కోరు బోర్డు పై పది పరుగులు కూడా చేరకముందే  సౌతాఫ్రికా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సౌతాఫ్రికాకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తాకింది. దీపక్ చాహర్ వేసిన  ఆ ఓవర్లో ఆఖరు బంతికి సఫారీ సారథి టెంబ బవుమా (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆసియాకప్  తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అర్ష్‌‌దీప్ రెండో ఓవర్లో దుమ్ము దులిపాడు.  

అర్ష్‌దీప్ వేసిన రెండో ఓవర్లో.. రెండో బంతికి  క్వింటన్ డికాక్  (1)  వికెట్ల మీదకు ఆడుకుని పెవిలియన్ చేరాడు. ఐదో బంతికి  రూసో (0) వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు క్యాచ్ ఇచ్చాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ మిల్లర్ (0)  కూడా తర్వాత బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అసలు గ్రౌండ్ లో ఏం జరుగుతుందో సౌతాఫ్రికా జట్టుతో పాటు  ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఓవర్ వేసిన చాహర్ దక్షిణాఫ్రికాకు మరో షాకిచ్చాడు.  మూడో ఓవర్ రెండో బంతికి ట్రిస్టన్ స్టబ్స్ (0)  అర్ష్‌దీప్ కు క్యాచ్ ఇచ్చాడు.  9 పరుగులకే ఐదు వికెట్లు. పీకల్లోతు కష్టాల్లో సౌతాఫ్రికా పడింది. 

సౌతాఫ్రికాకు  టీ20లలో  అత్యల్ప  పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి.  అంతకుముందు దుబాయ్ లో అఫ్గానిస్తాన్ తో మ్యాచ్ లో 20 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. 

 

ఆ క్రమంలో వచ్చిన పార్నెల్ తో కలిసి మార్క్రమ్ (24 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. కానీ హర్షల్ పటేల్.. మార్క్రమ్ పని పట్టాడు.  ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన హర్షల్.. చివరి బంతికి  మార్ర్కమ్ ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 42 రుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.  

ప్రస్తుతం పార్నెల్ (13 బ్యాటింగ్),  కేశవ్ మహారాజ్ (0 బ్యాటింగ్) ఆడుతున్నారు. 9 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios