Asianet News TeluguAsianet News Telugu

IND vs IRE: శతకంతో హడలెత్తించిన హుడా.. దంచిన శాంసన్.. ఐర్లాండ్ బౌలింగ్ ను చెడుగుడు ఆడిన టీమిండియా

India vs Ireland 2nd T20I: ఇండియా-ఐర్లాండ్ మధ్య డబ్లిన్ వేదికగా జరుగుతున్న  రెండో టీ20 లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. టీమిండియా బ్యాటర్ దీపక్ హుడా  సెంచరీతో కదం తొక్కగా.. సంజూ శాంసన్ తనకు  అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

IND vs IRE: Deepak Hooda Maiden T20I Hundred and Sanju Samsoon Fifty Helps Team India To Put 228 Target behind Ireland
Author
India, First Published Jun 28, 2022, 10:49 PM IST

ఐర్లాండ్ పర్యటనలో భారత యువ జట్టు దుమ్ము రేపింది. తొలి టీ20లో ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన కుర్రాళ్లు రెండో మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ లో దుమ్ములేపారు. దీపక్ హుడా (57 బంతుల్లో 104.. 9 ఫోర్లు, 6 సిక్సర్లు), సంజూ శాంసన్  (42 బంతుల్లో 77.. 9 ఫోర్లు, 4 సిక్సర్లు) లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఈ ఇద్దరూ కలిసి ఐర్లాండ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. రెండో వికెట్ కు 176 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఫలితంగా భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఐర్లాండ్ గెలవాలంటే 20 ఓవర్లలో 228 పరుగులు చేయాలి.  

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న ఇషాన్ కిషన్ (3) మూడో ఓవర్లోనే పెవిలియన్ కు చేరాడు. కానీ మరో ఓపెనర్ సంజూ శాంసన్  కు జతకలిసిన దీపక్ హుడా బంతి దొరికితే బౌండరీ లైన్ దాటించడమే అన్న సూత్రంగా బాదాడు. 

సిక్సర్ తో ఖాతా తెరిచిన  హుడాకు తోడు శాంసన్ కూడా ధాటిగా ఆడటంతో అగ్నికి వాయువు తోడైనట్టుగా అయింది. దీంతో భారత జట్టు స్కోరు బ్రేకుల్లేకుండా పరుగులెత్తింది.  ఈ ఇద్దరూ కలిసి పోటీపడి మరీ బౌండరీలు, సిక్సర్లు బాదారు. 9వ ఓవర్ వేసిన డెలాని బౌలింగ్ లో శాంసన్ 4, 6 బాదగా ఆ తర్వాత ఓవర్లో హుడా వరుసగా రెండు సిక్సర్లు బాది టీ20లలో తొలి అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు.  ఈ ఇద్దరి దూకుడుతో భారత్ స్కోరు 10 ఓవర్లకే వికెట్ నష్టానికి 97  పరుగులకు చేరింది. 

బౌండరీల వర్షం.. సిక్సర్ల హోరు.. 

హాఫ్ సెంచరీ తర్వాత హుడా మరింత రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన జోషువా లిటిల్ బౌలింగ్ లో రెండు ఫోర్లు బాదాడు.  ఆ తర్వాత ఓల్ఫెర్ట్  ఓవర్లో 6, 4, 4 కొట్టాడు. ఇదే క్రమంలో శాంసన్ కూడా డెలాని వేసిన 13.4 ఓవర్లో ఫోర్ కొట్టి టీ20లలో తొలి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్లో హుడడా 6, 4 కొట్టగా.. చివరిబంతికి శాంసన్ కూడా బంతిని బౌండరీ దాటించాడు.  14 ఓవర్లు ముగిసేటప్పటికీ భారత్ స్కోరు  1 వికెట్ నష్టానికి 158 పరుగులకు చేరింది. ఈ క్రమంలో హుడా-శాంసన్ లు భారత్ తరఫున రెండో వికెట్ భాగస్వామ్యంలో కొత్త రికార్డు నెలకొల్పారు. 145 పరుగుల భాగస్వామ్యం తో వాళ్లు  రోహిత్ - కోహ్లి (138.. 2015లో దక్షిణాఫ్రికా మీద) లను అధిగమించారు. 

ఇక డెలానీ వేసిన 15వ ఓవర్లో  శాంసన్ వరుసగా 4, 4, 6, 6 బాదాడు. చివర్లో  స్కోరు వేగాన్ని మరింత పెంచే క్రమంలో  శాంసన్.. 17వ ఓవర్ రెండో బంతికి  ఔటయ్యాడు.  దీంతో భారత జట్టు తరఫున ఏ వికెట్ కైనా నమోదైన అత్యధిక భాగస్వామ్యానికి (176) తెరపడింది. శాంసన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5 బంతుల్లో 15.. 2 ఫోర్లు, 1 సిక్స్)  ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. 

 

హుడా సెంచరీ.. 

ఇండియా ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతికి జోషువా లిటిల్ వేసిన బంతిని పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో హుడా సెంచరీ పూర్తైంది. దీంతో అతడు టీ20లలో భారత్ తరఫున సెంచరీ చేసిన  ఆటగాళ్ల జాబితాతో నాలుగో బ్యాటర్  నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ (4 సెంచరీలు), కెఎల్ రాహుల్ (2), సురేశ్ రైనా (1) లు ఈ ఘనత  సాధించారు. 

సెంచరీ తర్వాత హుడా ఎక్కువసేపు నిలబడలేదు. అదే ఓవర్లో ఓ ఫోర్ కొట్టి ఆఖరి బంతికి అండీ బెక్ బ్రైన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన దినేశ్ కార్తీక్ (0) కూడా డకౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ (0) కూడా అతడి బాటలోనే నడిచాడు. 19వ ఓవర్లో యంగ్.. ఐదు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో భారత్ మరింత భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. చివర్లో హార్ధిక్ పాండ్యా (15), భువీ (1) నాటౌట్ గా నిలిచారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోషువా లిటిల్, క్రెయిగ్ యంగ్ లు తలో  రెండు వికెట్లు పడగొట్టారు. కానీ ఆరుగురు బౌలర్లు బౌలింగ్ వేయగా అందులో ప్రతి ఒక్కరి ఎకానమీ 10 దాటడం గమనార్హం. 

టీ20లలో ఐర్లాండ్ లో ఇది రెండో అత్యుత్తమ స్కోరు..  అంతకుముందు ఇదే డబ్లిన్ లో స్కాట్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ (2019 లో)  252-3 అత్యధిక స్కోరు నమోదైంది.

Follow Us:
Download App:
  • android
  • ios