IND vs ENG: ఇంగ్లాండ్‌ క్రికెటర్ షోయబ్‌ బషీర్‌ (Shoaib Bashir) భారత్‌ వచ్చేందుకు ఎదురైన వీసా కష్టాలు తీరాయి. తాజాగా ఆయన భారత్ కు వచ్చేందుకు వీసా మంజూరైంది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డుకు తెలిపింది

IND vs ENG: ఇంగ్లండ్ క్రికెటర్ షోయబ్ బషీర్ (Shoaib Bashir)ఎదుర్కొన్న వీసా కష్టాలు తీరాయి. ఆయన ఎట్టకేలకు (జనవరి 24) బుధవారం భారత పర్యటనకు వీసా పొందాడు. దీంతో ఈ యువ ఆటగాడు ఈ వారాంతంలో భారత్ చేరుకుంటారు. కానీ, గురువారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభ మ్యాచ్‌లో పాల్గొనలేదు.

ఈ సందర్భంగా ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డు (ECB) ప్రతినిధి మాట్లాడుతూ.. "షోయబ్ బషీర్ ఇప్పుడు వీసా పొందాడు, ఈ వారాంతంలో జట్టులో చేరడానికి భారత్‌ కు వెళ్తాడు. పరిస్థితి ఇప్పుడు పరిష్కరించబడినందుకు మేము సంతోషిస్తున్నాము." అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. 

అంతకుముందు బుధవారం.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బషీర్ లేకుండా భారత్‌కు వెళ్లడంపై తన నిరాశను వ్యక్తం చేశాడు. బషీర్‌కు వీసా వచ్చే వరకు అతని పర్యటనను వాయిదా వేయాలని యాజమాన్యం భావించిందని ఆయన చెప్పారు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. అబుదాబిలో నాకు ఈ వార్త తెలిసినప్పుడు .. బాష్ వీసా పొందే వరకు మనం విమానంలో వెళ్లకూడదని చెప్పాను. కానీ, బాష్ లేకుండానే వెళ్ళవలసి వచ్చినందుకు చాలా నిరాశ చెందాననీ అన్నారు. 

అసలేం జరిగింది? 

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ వీసా సమస్యలెదుర్కొన్నారు. దీంతో భారత్‌కు రావడం ఆలస్యం కావడంతో పెద్ద వివాదం తలెత్తింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ దీనిని నిరాశపరిచాడు, అయితే బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధి యువ ఆటగాడికి న్యాయంగా వ్యవహరించాలని డిమాండ్ చేశాడు. 20 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ బషీర్ ఇంగ్లిష్ కౌంటీ జట్టు సోమర్‌సెట్‌కు ఆడుతున్నాడు. అబుదాబిలో టీమ్‌తో కలిసి ఉన్న అతను వీసా లేకపోవడంతో భారత్‌కు రాలేకపోయాడు. పాకిస్థాన్ మూలానికి చెందిన బషీర్ ఆ తర్వాత ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. వీసా సమస్యపై యూకే ప్రధాని రిషి సునాక్‌ కార్యాలయం సైతం స్పందించింది. ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు ప్రధాని కార్యాలయం ప్రతినిధి వెల్లడించారు. 

తాజాగా షోయబ్ బషీర్‌కు భారత్‌కు వీసా వచ్చింది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ వారం చివర్లో అతను జట్టులో చేరనున్నాడు. అయితే భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అతడు పాల్గొనలేడు. సిరీస్‌లో రెండో మ్యాచ్ వచ్చే శుక్రవారం నుంచి విశాఖపట్నంలో జరగనుంది. ఆ మ్యాచ్‌లో బషీర్ ఎంపికకు అందుబాటులో ఉంటాడు. అతడికి వీసా మంజూరు కావడంతో వివాదం సద్దుమణిగినట్లయింది. 

ఇటీవల ఇలాంటి మరొక సంఘటన జరిగింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా కూడా అదే వీసా సమస్యను ఎదుర్కొన్నాడు. 2023 సిరీస్ సమయంలో భారతదేశానికి ఆలస్యంగా వచ్చాడు. ఇంగ్లిష్ క్రికెటర్లు మొయిన్ అలీ, సాకిబ్ మహమూద్ కూడా భారత్‌కు వెళ్లేందుకు వీసా సమస్యలను ఎదుర్కొన్నారు.