Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాఫ్.. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక చతికిల.. తొలి టీ20లో ఆసీస్ గ్రాండ్ విక్టరీ

IND vs AUS T20I: భారీ స్కోరును ఆసీస్ ముందు నిలిపినా మన బౌలింగ్ దళం దానిని కాపాడుకోలేకపోయింది. ఆసీస్ బ్యాటర్లు క్లబ్ స్థాయి బౌలర్లను బాదిన మాదిరిగా టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు.

IND vs AUS T20I: Australia Beat India by 4 Wickets In Mohali
Author
First Published Sep 20, 2022, 10:41 PM IST

ఆసియా కప్ ఓటమిలో భారత్ ను ముంచిన బౌలింగ్.. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో కూడా అదే పని చేసింది. భారీ స్కోరును ఆసీస్ ముందు నిలిపినా మన బౌలింగ్ దళం దానిని కాపాడుకోలేకపోయింది. ఆసీస్ బ్యాటర్లు క్లబ్ స్థాయి బౌలర్లను బాదిన మాదిరిగా టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డారు.కామెరాన్ గ్రీన్ (30 బంతుల్లో 61, 8 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసానికి తోడు స్టీవ్ స్మిత్ (35), మాథ్యూ వేడ్ (21 బంతుల్లో 45 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18) ల మెరుపులతో  టీమిండియా నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. 6 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలుండగానే ఊదిపారేసింది. టీమిండియా  ప్రధాన బౌలర్లైన భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, చాహల్, హర్షల్ పటేల్, హార్థిక్ పాండ్యాలు భారీగా పరుగులిచ్చుకున్నారు. ఈ విజయం ద్వారా మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియాకు  అదిరిపోయే ఆరంభం దక్కింది. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదాడు ఆసీస్ సారథి ఆరోన్ ఫించ్ (13 బంతుల్లో 22, 3 ఫోర్లు 1 సిక్స్).  రెండో ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో గ్రీన్ వరుసగా నాలుగు బౌండరీలు బాదాడు. ఆ తర్వాత భువనేశ్వర్ వేసిన మూడో ఓవర్లో ఫించ్.. మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో 3 ఓవర్లకే ఆసీస్ స్కోరు 38 కి చేరింది. 

పేసర్లు ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో నాలుగో ఓవర్లోనే అక్షర్ ను దించాడు రోహిత్. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అక్షర్.. నాలుగో ఓవర్ మూడో బంతికి ఫించ్ ను బౌల్డ్ చేశాడు. అయితే ఆ ఆనందం భారత్ కు ఎంతో సేపు నిలువలేదు. 

ఉమేశ్ బౌలింగ్ లో వరుసగా నాలుగు బౌండరీలు కొట్టిన గ్రీన్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. చాహల్ వేసిన ఇన్నింగ్స్ 7వ ఓవర్లో రెండు సిక్సర్లు, బౌండరీ ద్వారా 19 పరుగులు రాబట్టాడు. స్టీవ్ స్మిత్ కూడా  దూకుడుగా ఆడటంతో  ఆసీస్ పరుగుల వేగం రాకెట్ కంటే స్పీడుగా పరిగెత్తింది.  దానికి తోడు భారత ఫీల్డర్ల క్యాచ్ మిస్ లు కూడా ఆస్ట్రేలియన్లకు కలిసొచ్చాయి. 

హార్ధిక్ వేసిన 8వ ఓవర్లో గ్రీన్ ఇచ్చిన క్యాచ్ ను మిడ్ వికెట్ వద్ద అక్షర్ మిస్ చేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గ్రీన్ హాఫ్ సెంచీర తర్వాత మరింత రెచ్చిపోయాడు. అక్షర్ వేసిన 9వ ఓవర్లో  ఐదో బంతికి స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను లాంగాఫ్ వద్ద రాహుల్ డ్రాప్ చేశాడు.  పది ఓవర్లకే ఆసీస్ స్కోరు వంద పరుగులు దాటింది. 

కానీ డ్రింక్స్ తర్వాత  ఆట స్వరూపమే మారిపోయింది. 11వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. గ్రీన్ ను  ఔట్ చేశాడు. ఆ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడిన గ్రీన్.. లాంగాన్ వద్ద కోహ్లీకి చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టిన స్టీవ్ స్మిత్.. నాలుగో బంతికి  దినేశ్ కార్తీక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అదే ఓవర్లో చివరి బంతికి ప్రమాదకర గ్లెన్ మ్యాక్స్వెల్ (1) కూడా స్మిత్ బాటలోనే పెవిలియన్ చేరాడు. మూడు ఫోర్లు కొట్టి జోరు మీదున్న జోష్ ఇంగ్లిస్  (17) ను అక్షర్ తన చివరి ఓవర్లో బోల్తా కొట్టించాడు. 

 

15 ఓవర్లకు ఆసీస్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 148 పరుగులుగా ఉంది. చివరి 5 ఓవర్లలో 61 పరుగులు అవసరం కాగా.. 16వ  ఓవర్లో హర్షల్ పటేల్  6 పరుగుల మాత్రమే ఇచ్చాడు. కానీ 17వ ఓవర్లో భువనేశ్వర్ 15 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత హర్షల్ కూడా 18వ ఓవర్లో 22 పరుగులిచ్చాడు. 19వ ఓవర్లో భువీ 16 పరుగులిచ్చి ఆసీస్ విజయాన్ని ఖాయం చేశాడు.  ఈ మూడు ఓవర్లలో భారత బౌలర్లను చీల్చి చెండాడింది ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్.. చివర్లో అతడు సృష్టించిన విధ్వంసంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. టీ20లలో భారత్ పై ఆసీస్ కు ఇదే అత్యధిక ఛేదన కావడం గమనార్హం. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా (71 నాటౌట్), కెఎల్ రాహుల్ (55), సూర్యకుమార్ యాదవ్ (46) లు మెరుపులు మెరిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా..  హెజిల్వుడ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. గ్రీన్ కు ఒక వికెట్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios