Asianet News TeluguAsianet News Telugu

భారత్ vs ఆస్ట్రేలియా : టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపిన జోష్ ఇంగ్లిస్ , 47 బంతుల్లో సెంచరీ, ఫించ్ సరసన చోటు

విశాఖ వేదికగా జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లిస్ జోష్ తన ధనాధన్ బ్యాటింగ్‌తో వీర విహరం చేశాడు.

IND vs AUS: Josh Inglis hits 47-ball 100, notches maiden T20I ton against India ksp
Author
First Published Nov 23, 2023, 8:56 PM IST

అహ్మాదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం తర్వాత భారత్ తొలి టీ20 సిరీస్ ఆడుతోంది. అది కూడా ఆసీస్‌పైనే కావడం గమనార్హం. విశాఖ వేదికగా జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇంగ్లిస్ జోష్ తన ధనాధన్ బ్యాటింగ్‌తో వీర విహరం చేశాడు. ఫోర్లు , సిక్సర్లతో మోత మోగించిన జోష్.. తొలుత కేవలం 29 బంతుల్లోనే అర్ధ శతకం చేశాడు.  

హాఫ్ సెంచరీ తర్వాత అతను మరింత రెచ్చిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బంతిని బౌండరీ దాటించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 47 బంతుల్లోనే సెంచరీ చేశాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ చేయడానికి కేవలం 18 బంతులే తీసుకున్నాడంటే జోష్ ఏ రేంజ్‌లో విధ్వంసం సృష్టించాడో అర్ధం చేసుకోవచ్చు. ఇది అతని టీ20ల్లోనూ, భారత్‌పైనా తొలి సెంచరీ. అర్ష్‌దీప్ వేసిన 17వ ఓవర్ 4వ బంతికి ఫోర్ బాదిన ఇంగ్లిస్ జోష్ సెంచరీ పూర్తి చేశాడు.

శతకం పూర్తయిన తర్వాత కూడా అదే జోరు కొనసాగించే క్రమంలో జోష్ ఇంగ్లిష్ 110 పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రసిద్ధ్ వేసిన 18వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడిన జోష్.. డీప్ మిడ్ వికెట్‌లో యశస్వి జైస్వాల్‌కు చిక్కాడు.  అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లు వుండగా.. స్ట్రైక్ రేట్ 224.49. టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రెండవ ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఆరోన్ ఫించ్ సరసన జోష్ నిలిచాడు. 2013లో సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌పై ఫించ్ ఈ రికార్డు నెలకొల్పాడు. అలాగే జోష్.. టీ20లలో సెంచరీ చేసిన ఐదవ ఆస్ట్రేలియన్‌గా నిలిచాడు. 

అతని దూకుడుతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 52, మాథ్యూ షార్ట్ 13, మార్కస్ స్టోయినిస్ 7, టిమ్ డేవిడ్ 19 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్‌లు చేరో వికెట్ పడగొట్టారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios