IND vs AUS: ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్.. అహ్మదాబాద్ లో టీమిండియాకు గ్రాండ్ వెల్కమ్..
India vs Australia: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నమెంట్ లో భారత్ చివరిసారిగా 2011లో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకుంది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో తొలి ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది.
ICC Cricket World Cup 2023: వెలుగుల కాంతులు నింపే దీపావళి పండుగ ముగిసిపోయి ఉండవచ్చు కానీ దేశంలో ఇంకా పండగ వాతావరణమే కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో పండుగ వాతావరణ నెలకొంది. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్ కు చేరుకున్న టీంఇండియాకు ఘనస్వాగతం పలుకుతూ హోటల్ వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో అసాధారణ ఫామ్ ను ప్రదర్శించిన టీంఇండియా ఒక్క ఓటమి లేకుండా అజేయంగా నిలిచి ఫైనల్ కు చేరిన 10 మ్యాచ్ ల్లోనూ విజయాలు సాధించింది. 1983, 2011లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత్.. 2003లో రన్నరప్ గా నిలిచింది. టీమిండియా ఇప్పుడు నాలుగోసారి వన్డే ప్రపంచకప్ ఫైనల్ కు చేరుకుని.. కప్పుకొట్టడానికి సిద్ధంగా ఉంది. బుధవారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీల అద్భుత ప్రదర్శనతో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. గ్రాండ్ గా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ లోకి అడుగుపెట్టింది.
397/4 భారీ స్కోరుతో కోహ్లీ రికార్డు స్థాయిలో 50వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 105 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్ మహ్మద్ షమీ ఏడు వికెట్లతో తన అద్భుత ప్రదర్శనతో భారత్ కు విజయాన్ని అందించారు. న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకే ఆలౌటవగా, భారత్ మరో జట్టు ప్రయత్నంతో చిరస్మరణీయ విజయం సాధించి మూడో వన్డే ప్రపంచ కప్ టైటిల్ ను సొంతం చేసుకోవడానికి ముందుకు సాగుతోంది.