ఇటీవలే మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా... 2006లో ఇదే కారణాలతో ఇంగ్లాండ్ క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్ కూడా ఆటను వదిలేశాడు. ఆ సమయంలో భారత పర్యటనలో ఉన్న మార్కస్ ఆట మధ్యలోనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 

అయితే.. అప్పటికి ప్రజలకు ఈ మానసిక సమస్యల గురించి పెద్దగా అవగాహన లేదు. దీంతో.. క్రికెటర్ల అంటే పెద్ద స్టార్స్. కావాల్సినంత డబ్బు.. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లొచ్చు అనే అనుకుంటారు. అయితే.. మ్యాక్స్ వెల్ సమయానికి వచ్చే సరికి అతని సమస్యను అందరూ అర్థం చేసుకున్నారు. అతనికి ప్రస్తుతం విశ్రాంతి కూడా ఇచ్చారు. 

కాగా... తాజాగా ఈ విషయం గురించి విరాట్ కోహ్లీ స్పందించాడు. మ్యాక్స్‌వెల్‌ తీసుకున్న నిర్ణయానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతు పలికాడు. మ్యాక్స్‌వెల్‌ నిర్ణయం అసాధారణమని ప్రశంసించాడు. తన కెరీర్లో కూడా ఇలాంటి సంధి దశను ఎదుకున్నానని, ఆ సమయంలో ప్రపంచం ముగిసిందనుకున్నా అని కోహ్లీ తెలిపాడు.
 
మ్యాక్స్‌వెల్‌ స్వల్ప విరామం తీసుకోవడంతో క్రికెటర్ల మానసిక ఆరోగ్య పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు అందరూ ఆ విషయంపైనే మాట్లాడుకుంటున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ కూడా ఓ మీడియా సమావేశంలో తన 2014 ఇంగ్లాండ్‌ పర్యటన అనుభవాలను పంచుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో జట్టులోని ప్రతి ఆటగాడికి కమ్యూనికేషన్ చాలా అవసరమని కోహ్లీ పేర్కొన్నాడు. అన్ని విషయాలు పంచుకోగలిగే సామర్థ్యం ఆటగాడికి ఉండాలన్నారు మ్యాక్స్‌వెల్‌ చేసింది గొప్పపని అని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.

తన కెరీర్లో కూడా ఇలాంటి దశను ఎదుర్కొన్నానంటూ షాకిచ్చాడు. ఆ సమయంలో ఇక ప్రపంచం ముగిసిపోయిందనుకున్నానన్నాడు.  ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో తెలియలేదు అంటూ అప్పటి విషయాలను కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. 

'అవతలి వ్యక్తుల మనస్సులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. మ్యాక్స్‌వెల్‌ తన నిర్ణయంతో ఈ ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. మనస్సు సరిగ్గా లేనప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. అలా కాకుండా.. కొంత విరామం తీసుకోవడం అవసరం' అని కోహ్లీ పేర్కొన్నాడు.

తాను మానసికంగా పూర్తిగా ఆరోగ్యంగా లేనని.. ఆట నుంచి దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు తాను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నాడు. ఎందుకంటే దానిని ఎలా చెప్పాలో కూడా తనకు తెలియలేదన్నాడు. అయితే.. ఆటను వదిలేయమని తాను చెప్పడం లేదని.. కాకపోతే.. ఇబ్బందిగా అనిపించినప్పుడు విశ్రాంతి కచ్చితంగా తీసుకోవాలని చెప్పాడు.