Asianet News TeluguAsianet News Telugu

పనిచేయని జడ్డూ మ్యాజిక్... తమిళనాడు చేతుల్లో చిత్తుగా ఓడిన సౌరాష్ట్ర...

తమిళనాడుతో మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఓడిన సౌరాష్ట్ర... బౌలింగ్‌లో 8 వికెట్లు తీసి మెరిసినా, బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన రవీంద్ర జడేజా..

Impressed with ball but failed with bat, Ravindra Jadeja in Ranji trophy match CRA
Author
First Published Jan 27, 2023, 4:29 PM IST

టీమిండియా తరుపున ఆడడాని కంటే భార్య తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు రవీంద్ర జడేజా. భార్యని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత తాపీగా టీమిండియా తరుపున ఆడడానికి సిద్ధమంటూ ప్రకటించాడు...

అయితే ఆరు నెలలుగా టీమ్‌కి దూరంగా ఉన్న రవీంద్ర జడేజాని రంజీ ట్రోఫీలో ఆడి ఫామ్ నిరూపించుకోవాల్సిందిగా కోరింది బీసీసీఐ. తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర కెప్టెన్‌గా బరిలో దిగిన జడ్డూ... బాల్‌తో రాణించినా, బ్యాటుతో మాత్రం తన మునుపటి ఫామ్‌ని చూపించలేకపోయాడు...


తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో పరాజయం పాలైంది సౌరాష్ట్ర జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 324 పరుగులు చేసింది. రవీంద్ర జడేజాకి ఓ వికెట్ దక్కగా ధర్మేంద్ర సిన్హ్ జడేజా 3, యువరాజ్‌‌సిన్ష్ దోహియా 4 వికెట్లు తీశాడు...

తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 192 పరుగులకి ఆలౌట్ అయ్యింది. చిరాగ్ జానీ 49 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 23 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తమిళనాడు బౌలర్లు సిద్ధార్థ, అజిత్ రామ్ మూడేసి వికెట్లు తీయగా సందీప్ వారియర్‌కి 2 వికెట్లు దక్కాయి...

రెండో ఇన్నింగ్స్‌లో జడ్డూ బంతితో మ్యాజిక్ చేశాడు. 17.1 ఓవర్లలో 3 మెయిడిన్లతో 53 పరుగులచ్చి 7 వికెట్లు తీశాడు. స్పిన్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్‌పై పరిస్థితులను చక్కగా వాడుకుని అనుకున్న రిజల్ట్ రాబట్టగలిగాడు. కెప్టెన్ కూడా తానే కావడంతో 36.1 ఓవర్లలో 17.1 ఓవర్లు తానే బౌలింగ్ చేశాడు రవీంద్ర జడేజా...

265 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన సౌరాష్ట్ర 206 పరుగులకి ఆలౌట్ అయిపోయింది. ఓపెనర్ హార్విన్ దేశాయ్ 205 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 101 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేయగలా అర్పిత్ వసువదా 45 పరుగులు చేశాడు. కెప్టెన్ రవీంద్ర జడేజా 36 బంతుల్లో 2 ఫోర్లతో 25 పరుగులు చేశాడు...

బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా.. బ్యాటింగ్‌లో మాత్రం 40 పరుగులే చేసి నిరాశపరిచాడు. తమిళనాడు బౌలర్ అజిత్ రామ్ 6 వికెట్లు తీయగా మనిమరణ్ సిద్ధార్థ్ 3 వికెట్లు తీశాడు..

సౌరాష్ట్రపై గెలిచినప్పటికీ తమిళనాడు క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. కారణం ఆంధ్రాతో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో ఓడింది తమిళనాడు. అంతకుముందు హైదరాబాద్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో విజయానికి 36 పరుగులు దశలో బ్యాడ్ లైట్ కారణంగా ఆట నిలిచిపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ రెండు మ్యాచుల కారణంగా తమిళనాడు క్వార్టర్ ఫైనల్‌కి అడుగు దూరంలో నిలిచిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios