Pakistan vs Australia ODI: తమ వన్డే క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్ అధ్బుత విజయాన్ని నమోదు చేసింది. కొండంత లక్ష్యాన్ని కరిగిస్తూ.. మరో ఓవర్ మిగిలుండగానే గెలుపును సొంతం చేసుకుంది. రెండు జట్లు కలిపి సుమారు 700 పరుగులు నమోదు చేశాయి.
పాకిస్థాన్ తమ వన్డే చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదనను విజయవంతంగా ముగించింది. భారీ లక్ష్యాన్ని వడివడిగా కరిగిస్తూ వన్డే సిరీస్ ను సమం చేసింది. గురువారం ఆసీస్ తో జరిగిన రెండో వన్డేలో ఆ జట్టు.. కంగారూలు నిర్దేశించిన 348 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది. భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్.. నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది. ఆ జట్టులో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (106), బాబర్ ఆజమ్ (114) లు సెంచరీలతో చెలరేగారు. ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం పాక్ వన్డే చరిత్రలో ఇదే తొలిసారి.
లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డేలో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆస్ట్రేలియా సారథి, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0) డకౌట్ అయినా.. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (70 బంతుల్లో 89.. 6 ఫోర్లు, 5 సిక్సర్లు), బెన్ మెక్ డెర్మట్ (108 బంతుల్లో 104.. 10 ఫోర్లు, 4 సిక్సర్లు) పాకిస్థాన్ బౌలర్ల పని పట్టారు.
రెండో వికెట్ కు 162 పరుగులు జోడించిన తర్వాత హెడ్ నిష్క్రమించినా.. లబూషేన్ (49 బంతుల్లో 59.. 5 ఫోర్లు) తో కలిసి డెర్మట్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 74 పరుగులు జోడించాడు. సెంచరీ తర్వాత డెర్మట్ ఔటైనా.. స్టోయినిస్ (33 బంతుల్లో 49), అబోట్ (16 బంతుల్లో 28) లు వీర బాదుడు బాదారు. ఫలితంగా ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో పాక్ కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఆ జట్టు ఓపెనర్లు ఫకర్ జమాన్ (64 బంతుల్లో 67.. 7 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇమామ్ ఉల్ హక్ (97 బంతుల్లో 106.. 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్ కు 118 పరుగులు జోడించారు. ఫకర్ జమాన్ ను ఇన్నింగ్స్ 18.5 ఓవర్లో స్టోయినిస్ ఔట్ చేసినా అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సారథి బాబర్ ఆజమ్.. (83 బంతుల్లో 114.. 11 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడాడు.
ఇమామ్ తో కలిసి బాబర్ రెండో వికెట్ కు 111 పరుగులు జోడించాడు. అయితే ఈ జోడీని జంపా విడదీశఆడు. అయితే అప్పటికే జోరు మీదున్న ఆజమ్.. కొద్దిసేపటికే సెంచరీ పూర్తి చేశాడు. మహ్మద్ రిజ్వాన్ (23) తో కలిసి మూడో వికెట్ కు 80 పరుగులు జోడించాడుు. అయితే 44.2 ఓవర్లో బాబర్ ఔటైనా.. ఖుష్దిల్ సా (17 బంతుల్లో 27 నాటౌట్), ఇఫ్తికార్ (8 నాటౌట్) లు పాక్ విజయాన్ని పూర్తి చేశారు. పాక్ బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు.
ఈ మ్యాచులో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న బాబర్ ఆజమ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఇదే వేదికలో రెండ్రోజుల క్రితం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక సిరీస్ లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే వేదికలో ఏప్రిల్ 2న జరుగుతుంది.
