మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్  వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించారు. వన్డే వరల్డ్ కప్  సమయంలో... కోహ్లీ భార్య అనుష్కశర్మకి బీసీసీఐ సెలక్టర్లు టీ ఇవ్వడాన్ని తాను కళ్లారా  చూశానంటూ... ఫరూక్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కాగా... దీనిపై తాజాగా అనుష్క స్పందించారు.

‘వారు(విమర్శలు చేసేవారు) చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే పునరావృతం అవుతూ ఉంది. అదొక నిజంలా మొత్తం ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న వార్తలు చూసి నేను భయపడుతున్నా. నేను ప్రతీదానికి మాట్లాడకుండా ఉంటే పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి ఈ రోజైనా ముగింపు దొరకాలి.’

‘ నా బాయ్‌ ఫ్రెండ్‌, భర్త కోహ్లి ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. దీనిపై కోహ్లి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉన్నాడు. నేను అప్పుడు కూడా సైలెంట్‌గానే ఉన్నా. అనవసరమైన కట్టుకథల్లోకి తరచు నా పేరును లాగుతున్నారు.  మీ అందరికీ నేనే దొరికానా. అసలు జరిగిన వాస్తవాలను మరుగన పడేస్తున్నారు. ’

‘కోహ్లి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నా సొంత ఖర్చులతోనే నేను అక్కడికి వెళుతున్నా.  ఎవరైనా అడిగిన క్రమంలో గ్రూప్‌ ఫోటోకి ఫోజిచ్చినా నన్నే విమర్శిస్తున్నారు. ఈ వార్తలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. అందుకే మౌనం వీడాల్సి వచ్చింది. ప్రతీ విషయంలోనూ అనవసరంగా నా పేరు లాగొద్దు. వాస్తవాలను మాట్లాడండి.. ఆధారాలతో మాట్లాడండి.. నన్ను ఇక్కడితో వదిలేయండి. మీరు ఫేమస్ అవ్వడానికి నా పేరు లాగొద్దు ’ అంటూ అనుష్క ఒక లేఖను విడుదల చేశారు.

కాగా... ఇటీవల ఫరూక్ ఇంజినీర్ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత జట్టు సెలక్షన్ కమిటీని మిక్కీమౌస్ టీమ్ గా అభివర్ణించారు. ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్నవారిలో ఒక్కరైనా కనీసం 10 నుంచి 12 టెస్టులు ఆడిన వారెవరైనా ఉన్నారా అని అన్నారు. ఇప్పుడున్న సెలక్షన్ కమిటీలో కొందరు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీలు తీసుకెళ్లడం తాను చూశానని ఇంజినీర్ అన్నాడు.  భారత జట్టు సెలక్షన్ కమిటీలో దిలీప్ వెంగ్ సర్కార్ స్థాయి ఉన్న వాళ్లు ఉండాలని ఆయన పేర్కొన్నాడు.