నేను కొడితే బాల్ గ్రౌండ్ ఆవల పడుతుందని వాళ్లూ వీళ్లూ చెప్పడమే తప్ప నాకూ తెలియదు! పొలార్డ్ ధమాకా సిక్సర్ చూశారా
IL T20: ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా ఆదివారం ఎంఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎమిరేట్స్ సారథి పొలార్డ్ కొట్టిన ఓ భారీ సిక్సర్.. స్టేడియం ఆవల పడింది.

కరేబియన్ వీరుడు, గతంలో వెస్టిండీస్ జట్టుకు సారథిగా వ్యవహరించిన కీరన్ పొలార్డ్ ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20) లో ఎంఐ ఎమిరేట్స్ తరఫున ఆడుతున్నాడు. సుదీర్ఘకాలంపాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఈ విండీస్ దిగ్గజం.. ఈసారి మాత్రం టీమ్ నుంచి తప్పుకుని బౌలింగ్ కోచ్ గా రానున్నాడు. అయితే ఐపీఎల్ లో ఆడకున్నా పొలార్డ్.. ఐఎల్ టీ20లో మెరుపులు మెరిపిస్తున్నాడు. అలవోకగా సిక్సర్లు కొట్టే ఈ స్టార్ ఆల్ రౌండర్.. ఐఎల్ టీ20 సందర్భంగా కొట్టిన ఓ సిక్సర్ ఏకంగా స్టేడియం బయటపడింది.
ఐఎల్ టీ20లో భాగంగా ఆదివారం ఎంఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎమిరేట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.
ఎమిరేట్స్ బ్యాటింగ్ చేస్తుండగా డెసర్ట్ వైపర్స్ బౌలర్ మతీశ పతిరన వేసిన ఓ బంతిని పొలార్డ్ లెగ్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఆ బంతి కాస్తా షార్జా స్టేడియం అవతల రోడ్డు మీద పడింది. రోడ్డు పక్కన ఉన్న ఓ యువకుడు పరుగుపరుగున వెళ్లి బంతిని తిరిగి గ్రౌండ్ లోకి విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్ లో ఎమిరేట్స్ టీమ్ తరఫున ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్ (50), మహ్మద్ వసీం (44 బంతుల్లో 86, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరబాదుడు బాదాడు. వసీంతో పాటు పొలార్డ్ కూడా 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఫలితంగా ఎమిరేట్స్.. 20 ఓవర్లలో 241 పరుగులు సాధించింది. తర్వాత లక్ష్య ఛేదనలో డెసర్ట్ వైపర్స్.. 12.1 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయింది. టామ్ కరన్ (12) టాప్ స్కోరర్. ఎమిరేట్స్ బౌలర్ ఫజల్లా ఫరూఖీ.. 3 వికెట్లు తీయగా జహూర్ ఖాన్, ఇమ్రాన్ తాహీర్ లు తలా రెండు వికెట్లు తీశారు. ఫలితంగా ఎమిరేట్స్ టీమ్.. 157 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.