Bombay High Court: మహారాష్ట్రలో క్రికెట్ స్టేడియాలలో కనీస వసతులు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై బాంబే హైకోర్టు ఆసక్దొకర వ్యాఖ్యలు చేసింది. అన్ని రకాలుగా అనుభవిస్తున్న మీరే (క్రికెటర్లు) ఇలా అంటే గ్రామాల్లో పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది.
రాష్ట్రంలో ఉన్న క్రికెట్ స్టేడియాలలో తాగునీరు, టాయ్‌లెట్ వసతులు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై బాంబే హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిల్లల తల్లిదండ్రులు వారి చిన్నారులకు క్రికెట్ కిట్లు కొంటున్నప్పుడు వాటర్ బాటిల్ కొనివ్వలేరా..? అని ప్రశ్నించింది. అసలు క్రికెట్ మన దేశపు ఆటనే కాదనే విషయాన్ని గుర్తించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, వాటిని పక్కనబెట్టి ఇలాంటి వాటి మీద విచారణ చేపట్టడమేంటని పిటిషనర్ ను మందలించింది.
అసలు విషయానికొస్తే.. మహారాష్ట్రలోని క్రికెట్ గ్రౌండ్‌లలో తాగునీరు, టాయ్‌లెట్ వసతులు సరిగా లేవని, ముంబై వంటి మహానగరంలో కూడా ఇదే సమస్యలు వెంటాడుతున్నాయని ఆరోపిస్తూ అడ్వకేట్ రాహుల్ తివారి బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను గురువారం చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎమ్ ఎస్ కర్ణిక్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్బంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘ఔరంగాబాద్ లోని గ్రామాల్లో నల్లా నీళ్లు వారినికి ఒకసారి వస్తాయని మీకు తెలుసా..? మీరు (క్రికెటర్లు) మీ సొంత నీళ్లు ఎందుకు తెచ్చుకోరు..? మీరు మన దేశం ఆటే కాని క్రికెట్ ను ఆడాలనుకుంటున్నారు. అసలది భారతదేశానికి చెందిన ఆటే కాదు. మీ తల్లిదండ్రులు మీరు క్రికెట్ ఆడుకోవడానికి కావాల్సిన బ్యాట్, ప్యాడ్స్, హెడ్ గార్డ్, చెస్ట్ గార్డ్, హెల్మెట్ తో పాటు ఆడటానికి కావాల్సిన కిట్ కొనిస్తున్నారు. వాళ్లు ఇవన్నీ కొనిచ్చినప్పుడు ఒక్క వాటర్ బాటిల్ కొనివ్వలేరా...?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది.
సకల సౌకర్యాలు అనుభవిస్తున్నవాళ్లే ఇలా అంటే గ్రామాల్లో కనీస వసతులు లేనివారి పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వారి గురించి ఆలోచించాలని సూచించింది.
అనంతరం ఈ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ఉద్దేశిస్తూ.. ‘మనం ఏ విషయాలను ప్రాధాన్యంలో చర్చిస్తున్నామో మీకు తెలుసా..? అక్రమ నిర్మాణాలు, వరదలు.. వాటి గురించి చర్చించండి.. ముందు మహారాష్ట్రలోని గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు తాగునీటిని ఇద్దాం’ అని సున్నితంగా మందలించింది.
