టీవీ ఛానెల్ మార్చినంత తేలిగ్గా ఐపీఎల్‌లో కెప్టెన్లను మార్చేస్తుంటారు. గత సీజన్‌లో కెప్టెన్లు ఉన్న రవిచంద్రన్ అశ్విన్, అజింకా రహానే... ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ప్లేయర్లుగా మారారు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా అజింకా రహానే, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు అశ్విన్ కెప్టెన్లుగా వ్యవహారించారు. అలాగే ఈ సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రౌడర్స్ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న దినేశ్ కార్తీక్, జట్టును విజయపథంలో నడిపించకపోతే కెప్టెన్సీ కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్.

గౌతమ్ గంభీర్ నుంచి కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న దినేశ్ కార్తీ, 2018లో జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చగలిగాడు. అయితే గత సీజన్‌లో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది కోల్‌కత్తా. 

‘ఈ సీజన్‌లో కోల్‌కత్తాకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఆండ్రూ రస్సెల్, ఇయాన్ మోర్గాన్, పాట్ కమ్మిన్స్ వంటి ప్లేయర్లతో బలంగా కనిపిస్తోంది కోల్‌కత్తా. ఇయాన్ మోర్గాన్‌కి కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. ఇంగ్లాండ్ జట్టుకు వరల్డ్ కప్ అందించాడు మోర్గాన్. ఒకవేళ కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ ఫెయిల్ అయితే అతని ప్లేస్‌లో మోర్గాన్ వచ్చేస్తాడు. అజింకా రహానేను తీసేసి, రాజస్థాన్ రాయల్స్‌కు స్టీవ్ స్మిత్‌గా కెప్టెన్‌గా నియమితమైనట్టే, కోల్‌కత్తా కూడా నిర్ణయం తీసుకోవచ్చు’ అన్నాడు సునీల్ గవాస్కర్.

ఆసీస్ పేసర్ పాట్ కమ్మిన్స్‌ను ఏకంగా రూ. 15 కోట్ల 50 లక్షలు చెల్లించి మరీ కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.