Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్‌లో ఆడనిస్తే అత్యధిక ధర పలికేది పాకిస్తాన్ ప్లేయర్లకే.. పాక్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు

IPL 2023: ప్రపంచ క్రీడా యవనికపై  అభిమానులను అత్యధికంగా అలరించే  అతికొద్ది లీగ్‌లలో ఇండియన్ ప్రీమియర్ లీగ్  (ఐపీఎల్) రెండో స్థానంలో ఉంది.  అయితే  ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్ క్రికెటర్లకు తప్ప ప్రతీ దేశం నుంచి  ఆటగాళ్లు ఇందులో ఆడేందుకు వీలుంది. 

If Pakistani players go to IPL,  These three will get picked for the big bucks: Former Pak cricketer Tanivr Ahmed Big Claim MSV
Author
First Published Feb 1, 2023, 3:29 PM IST

క్యాష్ రిచ్ లీగ్ గా ఉన్న ఐపీఎల్ లో ఆటగాళ్లు  కోటానుకోట్లు సంపాదించుకుంటున్నారు. టాలెంట్ ఉండి తమ జాతీయ జట్టు తరఫునో లేక ఏదైనా లీగ్ లో జోరు చూపిస్తేనో  ఆటగాళ్లకు  ఎన్ని కోట్ల రూపాయలు అయినా వెచ్చించి దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉంటాయి. అయితే ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్ క్రికెటర్లకు  తప్ప ఏ దేశం నుంచి అయినా   ఐపీఎల్ ఆడేందుకు  అనుమతి ఉంది.  తాజ్ హోటల్, ముంబైలో 26/11  దాడుల తర్వాత  పాకిస్తాన్ క్రికెటర్లపై నిరవధిక నిషేధం కొనసాగుతోంది. కానీ పాకిస్తాన్ క్రికెటర్లు ఐపీఎల్ లో ఆడితే అత్యధిక ధర పలికేది  తమ దేశపు ప్లేయర్లే అంటున్నాడు ఆ జట్టు మాజీ పేసర్  తన్వీర్ అహ్మద్. 

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  తన్వీర్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ పాకిస్తాన్ క్రికెటర్లకు గనక ఐపీఎల్ లో ఆడే అవకాశం దక్కితే అందరి కళ్లూ వాళ్లమీదే ఉంటాయి.  ఇండియాలో క్రికెటర్లతో పాటు ప్రేక్షకులు కూడా పాక్ ఆటగాళ్ల ఆటను ఇష్టపడతారు.  కానీ రాజకీయాల కారణంగా  మన ప్లేయర్లు అక్కడికి వెళ్లలేకపోతున్నారు..’ అని అన్నాడు. 

అదే క్రమంలో  ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. ‘ఒకవేళ పాక్ ప్లేయర్లు ఆడితే లీగ్ లో అత్యధిక ధర ఎవరు దక్కించుకుంటారు..?  బాబర్  ఆజమ్  మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ అవుతాడా...?’ అని ప్రశ్నించాడు. దానికి తన్వీర్  సమాధానం చెబుతూ.. ‘కచ్చితంగా. బాబర్, షాహీన్ (అఫ్రిది), రిజ్వాన్ లు. వేలంలోకి వెళ్తే ఈ ముగ్గురూ భారీ ధర దక్కించుకుంటారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు మాత్రం లీగ్ లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్ అవుతాడు. రిజ్వాన్ కాకపోవచ్చు గానీ బాబర్, షాహీన్ లలో ఎవరో ఒకరు అయితే కచ్చితంగా అవుతారు..’ అని చెప్పాడు. 

 

తన్వీర్ అహ్మద్ (2010 నుంచి 2013 వరకు).. పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున  ఐదు టెస్టులు, రెండు వన్డేలు, ఒక టీ20 ఆడి మూడు ఫార్మాట్లలో 20 వికెట్లు తీశాడు. కానీ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో  అతడు..  132 మ్యాచ్ లు ఆడి  512 వికెట్లు పడగొట్టాడు. 

ఇక పాకిస్తాన్ ప్లేయర్లపై నిషేధం లేకముందు వాళ్లు కూడా ఐపీఎల్ లో భాగమయ్యారు.  2008 ప్రారంభ సీజన్ లో  సోహైల్ తన్వీర్, యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్  లు రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడారు. ఈ సీజన్ లో  పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసినవారికి ఇచ్చేది) తన్వీర్ కే దక్కడం గమనార్హం.  షోయభ్ అక్తర్, సల్మాన్ భట్ , ఉమర్ గుల్, మహ్మద్ హఫీజ్  లు కోల్‌కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహించారు. షోయభ్ మాలిక్, మహ్మద్ అసిఫ్ లు ఢిల్లీకి ఆడగా.. మిస్బా ఉల్ హక్ (ఆర్సీబీ), షాహీద్ అఫ్రిది (డెక్కన్ ఛార్జర్స్) లు కూడా ఈ లీగ్ లో భాగమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios