వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో హనుమ విహారి సెంచరీ చేయడం పట్ల అతని సోదరి వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు. నాన్నే బతికుంటే విహారి శతకం చూసి ఎంతో సంతోషపడేవారని ఆమె తెలిపారు.

విండీస్‌పై విజయంలో బుమ్రా, విహారి కీలకపాత్ర పోషించారని వైష్ణవి పేర్కొన్నారు. జస్ప్రీత్ ఐదు వికెట్ల ఘనత హ్యాట్రిక్‌తో తన సోదరుడి శతకం మరుగున పడిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే బుమ్రా, విహారీలకు అది ప్రత్యేకమైన రోజని... ఇద్దరూ జట్టుని పటిష్ట స్థితిలో నిలిపారని.. ఆ రోజున తాను భావోద్వేగం చెందానని వైష్ణవి తెలిపారు. ఎంత రాత్రైనా సరే విహారి బ్యాటింగ్ తాను మిస్సవ్వలేదని.. కెరీర్‌లో తొలి శతకాన్ని మా నాన్నకి అంకితమిచ్చాడని గుర్తు చేసుకున్నారు.

సింగరేణి బొగ్గుగనుల సంస్థలో తమ తండ్రి మాజీ సూపరింటెండెంట్ ఇంజినీరని.. విహారి 12 ఏళ్ల వయసులో అర్థశతకం చేసి 3 వికెట్లు తీసినప్పుడు నాన్న ఆనంద బాష్పాలు కార్చారని వైష్ణవి తెలిపారు. ఇప్పుడు ఆయన ఉండుంటే ఎలా ఫీలయ్యేవారోనని మ్యాచ్ ముగిసిన రోజు తాను భావోద్వేగం చెందానని వైష్ణవి వెల్లడించారు.