షెడ్యూల్ ప్రకారం జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌లో జరగాల్సిన నాలుగో టెస్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో క్వీన్స్‌లాండ్‌లో నిబంధనలు కఠినతరం చేశాయి. బయటి వాళ్లు లోపలికి రాకుండా, లోపలివాళ్లు బయటికి పోకుండా లాక్‌డౌన్ విధించిన క్వీన్‌లాండ్స్ ప్రభుత్వం, భారత జట్టును ప్రత్యేక విమానం ద్వారా బ్రిస్బేన్ చేరుకునేందుకు అనుమతినిచ్చింది.

అయితే నాలుగో టెస్టు ఆడడానికి ముందు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుందని సూచించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 14 రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న భారత జట్టు... మళ్లీ నాలుగో టెస్టుకి ముందు కూడా క్వారంటైన్‌లో ఉండేందుకు సుముఖంగా లేనట్టు తెలిపింది.

అవసరమైతే బ్రిస్బేన్‌కి బదులుగా మరో నగరంలో చివరి టెస్టు నిర్వహించాలంటూ తెలిపింది. దీంతో నాలుగో టెస్టు నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. క్వీన్‌లాండ్స్ హెల్త్ షాడో మినిస్టర్ రోజ్ బేట్స్ ఈ విషయంపై కామెంట్ చేసింది..

‘గబ్బ టెస్టుకి ముందు క్వారంటైన్ నిబంధనలను కేవలం వారి కోసం సడలించాలని భారత క్రికెట్ జట్టు కోరుతున్నట్టు నాకు తెలిసింది. రూల్స్ ప్రకారం ఆడలేకపోతే.... ఇక్కడికి రాకండి...’ అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది మంత్రి రోజ్ బేట్స్. రోజ్ బేట్స్ కామెంట్లతో నాలుగో టెస్టు జరుగుతుందా? లేదా? జరిగితే ఎక్కడ జరుగుతుందనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.