సారాంశం
ICC WTC Final 2023 Day 1 లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... కీలకంగా రెండో ఇన్నింగ్స్..
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని కాపాడుకోగలిగింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకి శుభారంభం దక్కింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఇద్దరూ మెయిడిన్ ఓవర్లతో ఇన్నింగ్స్‌ని మొదలెట్టారు..
10 బంతులు ఆడి పరుగులేమీ చేయలేకపోయిన ఉస్మాన్ ఖవాజా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా..
ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన డేవిడ్ వార్నర్, స్కోర్ బోర్డులో కదలిక తీసుకొచ్చాడు. ఉమేశ్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో 4, 0, 4, 4, 4 బాదిన డేవిడ్ వార్నర్, 16 పరుగులు రాబట్టాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో లబుషేన్ అవుట్ కోసం డీఆర్‌ఎస్ తీసుకుంది టీమిండియా..
అయితే అంపైర్స్ కాల్‌గా తేలడంతో టీమిండియాకి ఫలితం దక్కలేదు. ఆ తర్వాత మరోసారి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లోనే ఇంకోసారి లబుషేన్ వికెట్ కోసం డీఆర్‌ఎస్ కోరుకుంది భారత జట్టు. అయితే బంతి వికెట్లను మిస్ కావడంతో టీమిండియా రివ్యూ కోల్పోయింది..
60 బంతుల్లో 8 ఫోర్లతో 43 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొదటి సెషన్ ముగిసే సమయానికి 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...
పిచ్, వాతావరణం బౌలింగ్ టీమ్‌కి చక్కగా ఉపయోగపడుతున్నా వరుస వికెట్లు తీసి ఆస్ట్రేలియా టీమ్ మీద ఒత్తిడి పెంచడంలో టీమిండియాకి పెద్దగా సక్సెస్ దక్కలేదు. డేవిడ్ వార్నర్‌తో కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించిన మార్నస్ లబుషేన్ 61 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి క్రీజులో ఉండగా స్టీవ్ స్మిత్ 7 బంతుల్లో 2 పరుగులు చేశాడు..
ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌కి వెన్నెముక లాంటి ఈ ఇద్దరిని భారత బౌలర్లు ఎంత త్వరగా అవుట్ చేస్తే, టీమిండియా అంత త్వరగా పైచేయి సాధించడానికి అవకాశం దొరుకుతుంది.