Asianet News TeluguAsianet News Telugu

ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీ... భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆస్ట్రేలియా! ఆలస్యం చేస్తే...

ICC WTC Final: టీ బ్రేక్ సమయానికి 51 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీ...

ICC WTC Final 2023: Travis Head half century, Australia heading towards huge score CRA
Author
First Published Jun 7, 2023, 7:30 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. టీమిండియాపై ఘనమైన రికార్డు ఉన్న ట్రావిస్ హెడ్ మరోసారి హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో 51 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ అప్పగించాడు. 10 బంతులు ఆడిన ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా పరుగులేమీ చేయకుండానే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించారు. శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో 4 ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టిన డేవిడ్ వార్నర్, హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు.

60 బంతుల్లో 8 ఫోర్లతో 43 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మార్నస్ లబుషేన్ వికెట్ కోసం రెండు సార్లు డీఆర్‌ఎస్ తీసుకుంది టీమిండియా. అయితే ఓసారి అంపైర్ కాల్స్‌గా రావడంతో బతికిపోయిన లబుషేన్, మరోసారి లక్కీగా బంతి వికెట్లను మిస్ కావడంతో లైఫ్ దక్కించుకున్నాడు...

లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. లంచ్ బ్రేక్ తర్వాత వస్తూనే లబుషేన్‌ని అవుట్ చేశాడు మహ్మద్ షమీ. 62 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

ఐదో స్థానంలో వచ్చిన ట్రావిస్ హెడ్, వస్తూనే వన్డే స్టైల్‌లో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 60 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్న ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌తో కలిసి నాలుగో వికెట్‌కి భారీ భాగస్వామ్యం జోడిస్తున్నాడు..

మరో ఎండ్‌లో స్టీవ్ స్మిత్ కూడా క్రీజులో కుదురుకుపోయాడు. 102 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, 75 బంతుల్లో 10 ఫోర్లతో 60 పరుగులతో ఉన్న ట్రావిస్ హెడ్‌తో క్రీజులో ఉన్నాడు. ఈ ఇద్దరినీ త్వరగా అవుట్ చేయకపోతే టీమిండియాకి కష్టమైపోవచ్చు...

తొలిరోజు మొదటి సెషన్‌తో పాటు రెండో సెషన్‌లో కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం సాగింది. ఈ భాగస్వామ్యాని త్వరగా విడకొట్టకపోతే భారత జట్టు భారీ నష్టం జరగొచ్చు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 250+ 'స్కోరు చేసినా టీమిండియాకి కష్టమైపోతుంది. కెన్నింగ్టన్ ఓవల్ బౌన్సీ పిచ్‌ మీద ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌ని తట్టుకుంటూ టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించాలంటే... భారత బ్యాటర్లు అద్భుతం చేయాల్సి ఉంటుంది...

ఇలాంటి పిచ్‌ మీద రిషబ్ పంత్‌కి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే అతను కూడా ఇప్పుడు టీమ్‌కి అందుబాటులో లేడు.  

Follow Us:
Download App:
  • android
  • ios