WTC Final 2023: సాంప్రదాయ  క్రికెట్‌కు మారుపేరైనా టెస్టులను బతికించడానికి ఐసీసీ తీసుకొచ్చిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)  లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్  కు చేరింది. 

ఐదుగురు కెప్టెన్లు.. ఆరు సిరీస్‌లు.. ఇద్దరు కోచ్‌లు.. రెండేండ్ల కష్టం.. ఐదు రోజుల్లో తేలనున్న ఫలితం.. ఇదీ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ జర్నీ. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్న భారత క్రికెట్ జట్టు మరోసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో 2021 - 2023 వరకూ సాగిన టీమిండియా టెస్టు ప్రయాణాన్ని ఓసారి నెమరువేసుకుందాం.. 

2021లో ఐసీసీ తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్స్ (2021)లో కివీస్ చేతిలో ఓడిన తర్వాత కొద్దిరోజులకే భారత జట్టు కొత్త సైకిల్ (2021-2023) ను మొదలుపెట్టింది. ఇదే ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌తో భారత్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 

ఐదుగురు కెప్టెన్లు.. 

ఈ రెండేండ్ల ప్రయాణంలో భారత జట్టును ఐదుగురు సారథులు నడిపించారు. 2022లో దక్షిణాఫ్రికా పర్యటన వరకూ భారత జట్టును విరాట్ కోహ్లీనే నడిపించాడు. మధ్యలో 2021 డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో ఒక టెస్టు (కాన్పూర్) కు అజింక్యా రహానే సారథిగా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత కోహ్లీ టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 2022లో శ్రీలంక జట్టు భారత పర్యటనకు రాగా ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ టీమిండియాకు పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇంగ్లాండ్‌తో మిగిలిపోయిన ఒక టెస్టుకు రోహిత్ అక్కడికి వెళ్లినా కరోనా కారణంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా సారథిగా ఉన్నాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు రోహిత్ గాయపడటంతో రెండు టెస్టులకు కెఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించాడు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీకి మాత్రం హిట్‌మ్యానే కెప్టెన్ గా ఉన్నాడు. 

2021 - 2023 సీజన్ లో భారత్ మొత్తంగా 18 టెస్టులు ఆడితే ఇందులో కోహ్లీ 7 టెస్టులకు సారథిగా ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ 6 టెస్టులకు.. కెఎల్ రాహుల్ 3, రహానే, బుమ్రాలు తలా ఒక టెస్టుకు కెప్టెన్‌గా ఉన్నారు.

ఇద్దరు హెడ్‌కోచ్‌లు.. 

రెండేండ్ల వ్యవధిలో భారత్‌కు ఇద్దరు హెడ్‌కోచ్ లుగా వ్యవహరించారు. 2021 వరకూ కొనసాగిన రవిశాస్త్రి ఆ ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత తప్పుకోవడంతో రాహుల్ ద్రావిడ్ ఆ బాధ్యతలను స్వీకరించాడు. ద్రావిడ్ 14 టెస్టులకు కోచ్ గా ఉండగా రవిశాస్త్రి నాలుగు మ్యాచ్ లకు కోచ్ గా వ్యవహరించాడు. 

సిరీస్‌లు.. విజయాలు.. అపజయాలు

- ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు గాను తొలి విడతలో నాలుగు టెస్టులు జరిగాయి. ఇందులో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. గతేడాది ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఓడి సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది. 
- న్యూజిలాండ్ సిరీస్ (2021) ను 1-0తో గెలుచుకుంది. 
- సౌతాఫ్రికా పర్యటన (2021-22) లో భాగంగా ఒక మ్యాచ్ గెలిచి రెండింట్లో ఓడి సిరీస్ పోగొట్టుకుంది. 
- 2022లో శ్రీలంకతో స్వదేశంలో జరిగిన రెండు టెస్టులూ గెలచుకుంది. 
- 2022లో బంగ్లాదేశ్‌తో ఆడిన రెండు టెస్టులూ గెలిచి సిరీస్ ను 2-0తో గెలిచింది. 
- ఈ ఏడాది బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో కంగారూలను బోల్తా కొట్టించింది.