తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... ఫాలో-ఆన్ గండం దాటినా, ఆస్ట్రేలియాకి భారీ ఆధిక్యం...
ICC WTC Final 2023: ఏడో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్... ఓవల్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదిన శార్దూల్ ఠాకూర్... తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకి 173 పరుగుల భారీ ఆధిక్యం..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 298 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్ స్కోరు 151/5 వద్ద మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, మరో 147 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది..
అజింకా రహానే, శార్దూల్ ఠాకూర్ హాఫ్ సెంచరీలతో రాణించి... ఏడో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అజింకా రహానే అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన టీమిండియా ఫాలో-ఆన్ గండం నుంచి తప్పుకున్నా, 300 మార్కు కూడా అందుకోలేకపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకి 173 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది..
కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులు చేసి అవుట్ కాగా శుబ్‌మన్ గిల్ 13, ఛతేశ్వర్ పూజారా 14, విరాట్ కోహ్లీ 14 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో రవీంద్ర జడేజా, అజింకా రహానే కలిసి ఐదో వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
51 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 48 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 5 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, మూడో రోజు ఉదయం సెషన్‌లో రెండో బంతికి బోలాండ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
అజింకా రహానే, శార్దూల్ ఠాకూ్ కలిసి ఏడో వికెట్‌కి 109 పరుగుల భాగస్వామ్యం జోడించి టీమిండియాని ఆదుకున్నారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం కారణంగా మూడో రోజు తొలి సెషన్ ఆటలో ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిక్యం కనబర్చిన భారత జట్టు, 260/6 పరుగులతో లంచ్ బ్రేక్‌కి వెళ్లింది..
లంచ్ బ్రేక్ తర్వాత రెండో ఓవర్‌లోనే అజింకా రహానే అవుట్ అయ్యాడు. 129 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసిన అజింకా రహానే, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ పట్టిన డైవింగ్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు.. ఈ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో 26వ హాఫ్ సెంచరీ అందుకున్న రహానే, టెస్టుల్లో 5 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
11 బంతుల్లో ఓ ఫోర్ బాది 5 పరుగులు చేసిన ఉమేశ్ యాదవ్, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన శార్దూల్ ఠాకూర్, హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఓవల్‌లో శార్దూల్ ఠాకూర్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ..
109 బంతుల్లో 6 ఫోర్లతో 51 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రెండో బంతికే సిరాజ్ అవుటైనట్టు అంపైర్ ప్రకటించడం, ఆస్ట్రేలియా టీమ్ అంతా డగౌట్ చేరుకోవడం జరిగిపోయాయి.
అయితే డీఆర్‌ఎస్ రివ్యూలో మహ్మద్ సిరాజ్ నాటౌట్‌గా తేలడంతో ఆసీస్ టీమ్ మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చింది. 11 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన మహ్మద్ షమీ, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇవ్వడంతో 296 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్‌కి తెరపడింది.