ఇస్లామాబాద్‌: ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా వచ్చేనెల 16న జరుగనున్న దాయాదుల పోరులో పాక్ పైచేయి సాధిస్తుందని పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్, మాజీ కెప్టెన్ ఇంజమామ్‌ ఉల్ హక్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో తమ జట్టు పరాజయాల పరంపరకు బ్రేక్‌ పడుతుందని ఆయన అన్నాడు.

 భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ను ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకుంటారని, ఇతర జట్లతో గెలువకున్నా ఫర్వాలేదు గానీ ఒక్క భారత్‌పై నెగ్గాల్సిందే అనేంతగా తీసుకుంటారని ఇంజమామ్ అన్నాడు. భారత జైత్రయాత్రకు ఈసారి బ్రేక్ వేస్తామనే విశ్వాసం ఉందని అన్నాడు. 

అయితే ప్రపంచకప్ అంటే కేవలం ఈ ఒక్క మ్యాచ్ మాత్రమే కాదని, మిగిలినా జట్లపై కూడా గెలువాల్సి ఉంటుందని ఆయన అన్నాడు. ఇక ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌, భారత్ లతో పాటు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌లు సెమీస్‌ కు చేరే అవకాశం ఉందని అంచనా వేశాడు.

ప్రస్తుతం పాక్‌లో ఆటగాళ్ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని, ఎవరిని ఎంపిక చేయాలో అర్థం పరిస్థితి నెలకొందని ఆయన అన్నాడు. ప్రపంచకప్‌ లాంటి మహా సమరానికి ఆటగాళ్లను ఎంపిక చేయడమంటే సవాలేనని​ తెలిపాడు. 

ప్రస్తుతం పాక్‌ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని అన్నాడు. యువకులు, సీనియర్లతో జట్టు సమత్యుల్యంగా ఉందన్నాడు. ఆఫ్గనిస్తాన్‌ ఈ టోర్నీలో సంచలనాలు నమోదు చేసే అవకాశం లేకపోలేదని అన్నాడు.